పేరు రైతులది.. పైసలు కాంట్రాక్టర్లకు!
రైతు భరోసా సొమ్ముతో కాంట్రాక్టర్లకు బిల్లులు.. చెల్లింపుల్లో నయా దందాకు తెరతీసిన సర్కారు పెద్దలు;
రైతుల పేరు చెప్పి పరిశ్రమల స్థాపన కోసం సమీకరించిన భూములను కుదపెట్టి రూ.10 వేల కోట్లు తెచ్చిన ప్రభుత్వం.. రైతులకు తప్ప మిగతా అందరికీ ఆ సొమ్మును అప్పనంగా పంచిపెడుతోంది. రెండెకరాల్లోపు భూమి ఉన్న రైతులకే రైతుభరోసా చెల్లించి.. మిగతా రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపునకు ఖర్చు చేస్తోంది. ఈ చెల్లింపుల్లోనూ సర్కారు పెద్దలు నయా దందాకు తెరతీసినట్టు ప్రభుత్వవర్గాలే చెప్తున్నాయి. బడా కాంట్రాక్టర్లకు సంబంధించిన బిల్లు మొత్తాన్ని ఒకేరోజు చెల్లించకుండా ఆ మొత్తాన్ని విభజించి రోజుకు కొంత చొప్పున పేమెంట్లు చేస్తున్నారని సమాచారం. ఇలా రోజుకు రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు పేమెంట్లు చేస్తున్నారు. ఆ పైసలు మొత్తం రైతు భరోసా కోసం సమీకరించినవేనని ప్రభుత్వవర్గాలే చెప్తున్నాయి. యాసంగి సీజన్ లో ఎకరానికి రూ.6 వేల చొప్పున 1.50 కోట్ల ఎకరాలకు రైతుభరోసా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఖజానాలో సొమ్ములు లేకపోవడంతో టీజీఐఐసీ అధీనంలో ఉన్న హైదరాబాద్‌లోని విలువైన భూములను కుదువ పెట్టింది. ఇలా రూ.10 వేల కోట్లను సమీకరించింది. ఈ సీజన్ లో రైతుభరోసాకు రూ.9 వేల ఖర్చు చేయాల్సి ఉంటుందని.. మిగిలిన వెయ్యి కోట్లను ఇతర పనులకు ఖర్చు చేస్తామని మొదట్లో ప్రభుత్వంలోని ముఖ్యులు చెప్పారు. రెండెకరాల వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతుభరోసా జమ చేశారు. మిగిలిన రైతులు నెల రోజులుగా తమకు ఎప్పుడు రైతుభరోసా ఇస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.
2023 నవంబర్ 30న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే రైతుబంధు జమ చేయడానికి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రూ.7 వేల కోట్లకు పైగా నిధులను ఖజానాలో సిద్ధం చేసి ఉంచింది. రైతుబంధు ద్వారా ఓటర్లను ప్రలోభ పెట్టే అవకాశముందని కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేయడంతో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయకుండా ఈసీ ఆంక్షలు విధించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిరాగానే బడా కాంట్రాక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికై అసెంబ్లీలో అడుగు పెట్టిన నాయకులకు సంబంధించిన ఏజెన్సీలకు పెద్ద ఎత్తున బిల్లులు చెల్లించింది. దీంతో రైతుబంధు అమలు ఆలస్యమైంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఒక్కో సీజన్ కు ఎకరానికి రూ.7,500 చొప్పున ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 2024 వానాకాలం సీజన్ లో రైతుభరోసా ఇవ్వకుండా ఎగ్గొట్టింది. అనర్హులకు రైతుబంధు ద్వారా ప్రయోజనం చేకూరుతుందని.. కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలు, నేషనల్ హైవేలు, కమర్షియల్ స్థలాలకు రైతుబంధు సాయం అందుతుంది కాబట్టి వాటిని కట్టడి చేసే పేరుతో ఒక సీజన్ లో రైతులకు పెట్టుబడి సాయం ఎగ్గొట్టింది. యాసంగి సీజన్ లో ఒక్కో ఎకరానికి రూ.7,500లకు బదులుగా రూ.6 వేలు ఇస్తామని ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా తన సొంత నియోజకవర్గం కొడంగల్ లోని కోస్గి మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి రైతుభరోసా పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. మొదటి విడతలో ఒక్కో మండలానికి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో రైతులకు ఖాతాల్లో నగదు జమ చేశారు. ఇలా 577 గ్రామాల్లోని 4,41,911 మంది రైతులకు చెందిన 9,48,333 ఎకరాలకు రూ.593 కోట్లు ఆయా రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఆ తర్వాత ఎకరంలోపు భూమి ఉన్న 17.03 లక్షల రైతులకు చెందిన 9.29 లక్షల ఎకరాలకు రూ.557.54 కోట్లు జమ చేశారు. రెండో విడతలో రెండెకరాల లోపు భూమి ఉన్న 13.23 లక్షల మందికి చెందిన 18.19 లక్షల ఎకరాలకు రూ.1,091.95 కోట్లు చెల్లించారు. మూడో విడతలో మూడెకరాల లోపు భూమి ఉన్న 10.13 లక్షల మంది రైతులకు చెందిన 21.12 లక్షల ఎకరాలకు రూ.1,269.32 కోట్లు చెల్లిస్తున్నట్టు ప్రకటించినా ఆ సొమ్ము ఎక్కువ మంది రైతుల ఖాతాల్లో జమ కాలేదు. మొత్తంగా నాలుగు విడతల్లో కలిపి రూ.3,511.82 కోట్లు రైతులకు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.3 వేల కోట్లు కూడా రైతుల బ్యాంక్ ఎకౌంట్లలో జమ కాలేదు. అంటే రూ.500 కోట్లకు పైగా నిధులు దారి మళ్లించారు.
బడా కాంట్రాక్టు సంస్థలు, ప్రభుత్వంలోని ముఖ్యులకు సన్నిహితంగా ఉండే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు రైతు భరోసా సొమ్మును మల్లిస్తున్నారు. ఒక కాంట్రాక్టర్ కు రూ.600 కోట్లకు పైగా బిల్లు చెల్లించాల్సి ఉంటే ఆయనకు అంతే మొత్తానికి టోకెన్ జారీ చేస్తారు.. ఖజానాలో అంత మొత్తం నిల్వ లేకపోవడంతో ఆ టోకెన్ ను మూడుగా విభజించి ఒక్కో రోజు సదరు కాంట్రాక్టర్ కు రూ.200 కోట్లకు అటుఇటుగా చెల్లింపులు చేస్తూ మూడు, నాలుగు రోజుల్లోనే అతడి బిల్లును క్లియర్ చేస్తున్నారు. ఇలా గడిచిన నెల రోజుల్లో రూ.4 వేల కోట్లకు పైగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించినట్టు సమాచారం. అంటే రైతులకు ఇవ్వాల్సిన రూ.4 వేల కోట్లను కమీషన్ల కోసం ప్రభుత్వ పెద్దలే దారి మళ్లించి సొమ్ము చేసుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాంట్రాక్టర్లకు చేసిన పేమెంట్లలో 8 శాతం నుంచి 12 శాతం వరకు కమీషన్లు దండుకున్నారని సమాచారం. ఇంటే రూ.500 కోట్లు గడిచిన కొన్ని రోజుల్లోనే కొందరు ముఖ్యుల జేబుల్లోకి వెళ్లాయి. రూ.2 లక్షలకు పైగా అప్పులు ఉన్న రైతులు రూ.2 లక్షలకు పైబడి ఉన్న మొత్తాన్ని చెల్లిస్తే తాము రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనిని నమ్మి పెద్ద సంఖ్యలో రైతులు రూ.2 లక్షలకు పైబడి ఉన్న తమ అప్పులను వడ్డీతో సహా బ్యాంకులకు చెల్లించారు. వారి రుణమాఫీ గురించి ఇప్పుడు మాట్లాడే వారే లేరు. రైతుభరోసా కోసం పరిశ్రమల భూములు కుదబెట్టి తెచ్చిన డబ్బులను రైతులకు చెల్లించకుండా కాంట్రాక్టర్లకు పేమెంట్ చేస్తున్నారు. మూడెకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రైతుభరోసా జమ చేశామని ఇదివరకే ప్రభుత్వం ప్రకటించడంతో తమకు డబ్బులు రాలేదని పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క శుక్రవారం అధికారులను ఆదేశించారు.
సాగు భూములకూ రైతుభరోసా ఎగవేత
సాగుయోగ్యం కాని భూములకు రైతు భరోసా ఇవ్వబోమని చెప్పిన ప్రభుత్వం ఈక్రమంలోనే అలాంటి భూముల గుర్తింపునకు సర్వే చేసింది. ఈ సర్వే మొత్తం ప్రహసనంగా మారడంతో సాగుయోగ్యం కాని భూములతో పాటు పంటలు సాగు చేసిన భూములు సైతం బ్లాక్ లిస్ట్ అయ్యాయి. ఒక సర్వే నంబర్‌లో పదెకరాల భూమి ఉంటే అందులో సగం భూమి నేషనల్ హైవే కోసమో.. ఇరిగేషన్ ప్రాజెక్టుల కాల్వలు, ఇతర అవసరాల కోసమో సేకరిస్తే.. ఆ సర్వే నంబర్ మొత్తాన్ని బ్లాక్ లిస్టులో పెట్టారు. దీంతో అదే సర్వే నంబర్‌లో సాగు భూములకు రైతు భరోసా అందలేదు. ఇలా బ్లాక్ లిస్ట్ చేసిన భూములు రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఎకరాల వరకు ఉంటాయని చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం బ్లాక్ చేసిన 3 లక్షల ఎకరాల్లో సాగుయోగ్యం కాని భూమి సగం వరకే ఉంటుందని.. ప్రభుత్వ నిర్ణయం వల్ల మిగతా రైతులంతా ఇబ్బంది పడుతున్నారని వ్యవసాయ శాఖ గుర్తించింది. మొత్తానికి మొత్తం సర్వే నంబర్‌ను బ్లాక్ చేయకుండా సాగుయోగ్యం కాని భూమిని వేరుగా నమోదు చేసి మిగతా వారికి రైతు భరోసా చెల్లించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. అంటే రాష్ట్రంలో సాగుయోగ్యం కాని భూములు లక్షన్నర ఎకరాలకు అటుఇటుగా ఉంటుందని అంచనా. కోటిన్నర ఎకరాలకు ప్రతి సీజన్‌లో రైతుభరోసా సాయం అందిస్తే అందులో లక్ష, లక్షన్నర ఎకరాలు అంటే ఒక్క శాతంలోపే. అంటే కేసీఆర్ రైతుబంధు పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేశాడు.. అనర్హుల ఖాతాల్లో డబ్బులు వేశాడు అనే కాంగ్రెస్ ఆరోపణ తప్పు అని నూటికి నూరుపాళ్లు తేలిపోయింది. రైతుభరోసా సాయం పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తే అనర్హులకు కేసీఆర్ లబ్ధి చేశారన్న తమ ప్రచారం తప్పు అని స్పష్టమవుతుందనే కారణంతోనూ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రైతులకు పెట్టుబడి సాయం పంపిణీలో ఆలస్యం చేస్తుందన్న ఆరోపణలూ ఉన్నాయి.