పైసలు కావాలే.. అక్రమమైనా క్లియర్‌ చేసేయండి!

ఎల్‌ఆర్‌ఎస్‌ అప్లికేషన్‌లపై రేవంత్‌ సర్కారు నిర్ణయం;

Advertisement
Update:2025-03-03 16:42 IST

రాష్ట్ర ఖజానాకు అవసరమైన ఆమ్దానీ కోసం ఆగమాగం ఎల్‌ఆర్‌ఎస్‌ అప్లికేషన్లు క్లియర్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2020లో అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చిన లే ఔట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌)కు 25 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. అన్‌ అప్రూవుడ్‌ లే ఔట్స్‌ తో పాటు ఓపెన్‌ ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు వాటిని ఈ స్కీం ద్వారా రెగ్యులరైజ్‌ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందులో సుమారు 9 లక్షల అప్లికేషన్‌లను అధికారులు అప్పట్లో పరిశీలించారు. మిగతా 16 లక్షల అప్లికేషన్లను పరిశీలించాల్సి ఉంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం మరోసారి ఎల్‌ఆర్‌ఎస్‌ కు అప్లయ్‌ చేసేందుకు అవకాశం ఇచ్చింది. సోమవారం నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించింది. పాత, కొత్త అప్లికేషన్‌ దారులు ఈనెలాఖరులోపు తమ ప్లాట్లు రెగ్యులరైజేషన్‌ చేసుకుంటే నిర్దేశిత ఫీజులో 25 శాతం రాయితీ ప్రకటించింది. ఇలా తక్కువలో తక్కువ రూ.3 వేల కోట్లకు పైగా ఆమ్దానీ రాబట్టాలని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. ఈక్రమంలో అధికారులను పరుగులు పెట్టించి ఎల్‌ఆర్‌ఎస్‌ అప్లికేషన్లను క్లియర్‌ చేయిస్తుంది. ఎల్‌ఆర్‌ఎస్‌ అప్లికేషన్లను పూర్తి స్థాయిలో పరిశీలించడానికి తగినంత మంది సిబ్బంది లేరని అధికారులు చెప్పడంతో ఒక్కో లే ఔట్‌లో పది శాతం అప్లికేషన్లను పరిశీలించి మిగతా 90 శాతం అప్లికేషన్లకు క్లియరెన్స్‌ ఇచ్చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖల వద్దే 6.62 లక్షల అప్లికేషన్‌లు పెండింగ్‌

ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం చేసుకున్న అప్లికేషన్‌లకు సంబంధించిన ప్లాట్లు ప్రభుత్వ భూముల్లో ఉన్నాయా? ఇరిగేషన్‌ భూముల్లో ఉన్నాయా మొదట నిర్దారించాల్సి ఉంటుంది. వాటర్‌ బాడీలకు 200 మీటర్ల కన్నా ఎక్కువ దూరంలో ఉన్న ప్లాట్లను మాత్రమే క్లియర్‌ చేయాల్సి ఉంటుంది. అలాగే సంబంధిత లే ఔట్‌ ప్రభుత్వంలోని ఏదైనా శాఖకు సంబంధించినదా? లేదా అనేది రెవెన్యూ శాఖ నిర్దారించాల్సి ఉంటుంది. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం 2020లో వచ్చిన 25 లక్షల దరఖాస్తుల్లో గతంలో పరిశీలంచి క్లియర్‌ చేసినవి మినహా మిగతా 16 లక్షల అప్లికేషన్లను పరిశీలించాల్సి ఉంది. వాటర్‌ బాడీలకు సమీపంలో ఉన్న అప్లికేషన్లతో పాటు ప్రభుత్వ భూములకు సంబంధించిన సర్వే నంబర్లకు సమీపంలోని లే ఔట్లకు ఇరిగేషన్‌, రెవెన్యూ శాఖల ఎన్‌వోసీ తప్పనిసరి. ఆ తర్వాతే మున్సిపల్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఆయా లే ఔట్‌లు పరిశీలించి వాటిని క్లియర్‌ చేస్తారు. ఆ తర్వాతే ఆయా ప్లాట్ల రెగ్యులరైజేషన్‌ కు చెల్లించాల్సి చార్జీ ఆటోమేటిక్‌ గా జనరేట్‌ అవుతోంది. ఇరిగేషన్‌ శాఖ వద్ద 3.16 లక్షల అప్లికేషన్లు, రెవెన్యూ శాఖ వద్ద 3.46 లక్షల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నారు. అంటే ఈ రెండు శాఖలు క్లియర్‌ చేయాల్సిన దరఖాస్తులే 6.62 లక్షలు. ఇవి కాక ఇంకో మూడున్నర లక్షల దరఖాస్తులు కూడా అయితే ప్రభుత్వ భూములు, లేదంటే చెరువులకు సమీపంలోనే ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. వాటిని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే క్లియర్‌ చేయాలని అంటున్నారు.

ఆమ్దానీ కావాలే.. ఫాస్ట్‌గా క్లియర్‌ చేయండి

రాష్ట్ర ప్రభుత్వానికి ఆమ్దానీ కావాలి కాబట్టి వేగంగా ఎల్‌ఆర్‌ఎస్‌ అప్లికేషన్లను పరిశీలించి క్లియర్‌ చేయాలని ప్రభుత్వం అధికారులను వెంటపడి తరుముతోంది. అప్లికేషన్‌ల పరిశీలనకు అవసరమైనంత సిబ్బంది లేరని చెప్పినా పట్టించుకోవడం లేదు. ప్రతి లే ఔట్‌లో కనీసం పది శాతం అప్లికేషన్లకు సంబంధించిన భూములను ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ చేసి మొత్తం లే ఔట్‌కు క్లియరెన్స్‌ ఇవ్వాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. ఓపెన్‌ ప్లాట్లను రాండమ్‌ గా చెక్‌ చేసి మమ అనిపించాలని స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా ఎక్కువ అప్లికేషన్లు క్లియర్‌ చేయాలని సూచించింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిధిలో 14,56,762 అప్లికేషన్లు రాగా గతంలోనే వాటిలో 4.80 లక్షల అప్లికేషన్లను క్లియర్‌ చేశారు. గడిచిన నాలుగైదు రోజుల్లో మరో 20 వేల అప్లికేషన్లు క్లియర్‌ చేశారు. అంటే మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటి వరకు 5 లక్షల అప్లికేషన్లు మాత్రమే క్లియర్‌ చేశారు. వాటిని కొనుగోలు చేసిన వారితో రెగ్యులరైజేషన్‌ ఫీజులు కట్టించే పనిలో రిజిస్ట్రేషన్‌ శాఖతో పాటు ప్రభుత్వ అధికారులు ఉన్నారు. మిగతా అప్లికేషన్ల క్లియరెన్స్‌ లో ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటే అనేక అక్రమ లే ఔట్లు సక్రమం అవుతాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉండటంతో ఆయనను కలిసి ఈ విషయం నచ్చజెప్పలేకపోతున్నామని అధికారులు వాపోతున్నారు.

హైడ్రా స్ఫూర్తికి విరుద్ధంగా క్లియరెన్స్‌ లకు ఆదేశం

రాష్ట్రంలోని చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం హైడ్రా ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఔట్‌ రింగ్‌ రోడ్డు లోపలి మున్సిపాలిటీలను హైడ్రా పరిధిలోకి తెచ్చింది. ఓఆర్‌ఆర్‌ అవతల కూడా హైడ్రా మొదట్లో కూల్చివేతలు చేపట్టింది. ఇప్పుడు హైడ్రా ఏర్పాటు స్ఫూర్తికి విరుద్ధంగా ఎల్‌ఆర్‌ఎస్‌ అప్లికేషన్లను క్లియర్‌ చేయాలంటూ అధికారులపై సర్కారు ఒత్తిడి పెంచుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల భూములతో పాటు చెరువులకు సమీపంలో అనేక వెంచర్లు వేసి వాటిలోని ప్లాట్లను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అమాయక ప్రజలకు విక్రయించారు. గతంలో ఇలాంటి ప్లాట్లను కొని ప్రభుత్వం నుంచి అన్నిరకాల అనుమతులు తీసుకున్న నిర్మాణాలనే హైడ్రా ఏర్పాటు తర్వాత అక్రమమని చెప్తూ కూల్చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు కనీసం ఫీల్డ్‌ వెరిఫికేషన్‌కు అవకాశం ఇవ్వకుండా పది శాతం అప్లికేషన్లను మాత్రమే పరిశీలించి మొత్తం దరఖాస్తులను క్లియర్‌ చేయాలని చెప్తూ అక్రమ లే ఔట్లు అన్ని రెగ్యులరైజ్‌ చేసే ప్రయత్నాల్లో ఉంది. తద్వారా బడా రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు పెద్ద ఎత్తున లాభం చేసేందుకు ప్రయత్నిస్తోంది.

Tags:    
Advertisement

Similar News