ఆసిఫాబాద్‌లో జిల్లాలో పులి దాడి యువతి మృతి
కాగజ్‌నగర్ మండలం గన్నారం సమీపంలో చోటుచేసుకున్న ఘటన
కుమురం భీం ఆసిఫాబాద్‌లో జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం సృష్టించింది. ఆసిఫాబాద్‌లో జిల్లాలో యువతిపై పులి దాడి చేసింది. కాగజ్‌నగర్ మండలం గన్నారం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. పులి దాడితో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని మోర్లె లక్ష్మిగా గుర్తించారు. పులి దాడి చేయడం కలకలం రేపుతున్నది.దీంతో స్థానికులు తీవ్ర భయాందోళలకు గురవుతున్నారు.
పొలంలో పత్తి తీయడానికి వెళ్లిన లక్ష్మిపై పులి దాడి చేసింది. కాగజ్‌నగర్ మండలం గన్నారం శివారులో ఉదయం 7-7:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. పత్తి తీస్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన పెద్దపులి ఆమెపై దాడి చేసిందన్నారు. ఆ సమయంలో ఆమెతో పాటు మరికొంతమంది కూలీలు కేకలు వేశారు. ఆ అరుపులకు పులి పక్కననున్న అటవీ ప్రాంతానికి పారిపోయింది. అప్రమత్తమైన కూలీలు అక్కడే ఉండి చూశారు. అయితే పులి దాడికి అప్పటికే మోర్లె లక్ష్మి మృత్యువాత పడింది. మృతదేహంతో కాగజ్‌నగర్ అటవీ కార్యాలయం ముందు న్యాయం చేయాలంటూ ఆమె బంధువులు ధర్నాకు దిగారు.
ఉమ్మడి ఆసిఫాబాద్ జిల్లాలో పులల సంచారం ఎక్కువగా ఉన్నదని స్థానికులు చెబుతున్నారు. ఈ పులలన్నీ కూడా కవ్వాల్ అభయారణ్యానికి చెందినవి కావంటున్నారు. మహారాష్ట్రలోని తాడోబా అటవీ ప్రాంతం నుంచి వస్తున్నాయని పేర్కొంటున్నారు. గోదావరి నది పరివాహక ప్రాంతం కావడంతో కాగజ్‌నగర్, పెద్దవాగు పరివాహక ప్రాంతంలో పులి సంచరిస్తున్నది.. రెండుమూడేండ్ల కిందట కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకున్నది.