ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదం: టన్నెల్‌లో చిక్కున్నది వీళ్లే!

ఈ ఘటనలో మూడు మీటర్ల మేర పడిపోయిన పైకప్పు.. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్‌ వద్ద ప్రమాదం

Advertisement
Update:2025-02-22 14:45 IST

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ఘటనలో మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్‌ వద్ద ప్రమాదం జరిగింది. సొరంగంలోని రింగ్‌లు కిందపడి ప్రమాదం జరిగింది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలనే లక్ష్యంతో ఇటీవల ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. ఇందులో భాగంగా నాలుగు రోజుల కిందట పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం ఆ పనుల్లో ప్రమాదం చోటు చేసుకున్నది. టన్నెల్‌ పై భాగంలో మూడు మీటర్ల మేర పడిపోయింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని దోమలపెంట సమీపంలో పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. అధికారులు ఘటనా స్థలికి వెళ్లి పరిస్థితి సమీక్షిస్తున్నారు.

టన్నెల్‌ పై కప్పు కూలి కార్మికులు గాయపడిన ఘటనపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, నీటిపారుదల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. విషయం తెలుసుకున్నమంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.వారి వెంట నీటిపారుదల శాఖ సలహాదారుల ఆదిత్యనాథ్‌ దాస్‌, అధికారులు ఉన్నారు. ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం ఎలా జరిగిందనేది ఆరా తీశారు. లోపల చిక్కుకున్న వారిని క్షేమంగా తీసుకురావాలని.. గాయపడిన వారిని మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంటక్‌రెడ్డి, కొండా సురేఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

టన్నెల్‌లో చిక్కుకున్న వారి వివరాలు

గుర్‌జిత్‌ సింగ్‌ (పంజాబ్‌), సన్నీత్‌సింగ్‌ (జమ్ముకశ్మీర్‌), శ్రీనివాసులు (యూపీ), మనోజ్‌ రూబెన (యూపీ), సందీప్‌ (ఝార్ఖండ్‌), సంతోష (ఝార్ఖండ్‌), జట్కా హీరాన్‌ (ఝార్ఖండ్‌).మార్నింగ్ షిప్ట్లో సొరంగంలో పనులకు 50 మంది కార్మికులు వెళ్లారు. ప్రమాదం తర్వాత 42 మంది కార్మికులు బైటికి వచ్చారు. వారిలో ఇద్దరి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల కోసం రక్షణ చర్యలు చేపట్టారు.  ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

Tags:    
Advertisement

Similar News