త్వరలోనే లగచర్లలో పర్యటిస్తాం
అత్యాచార ఆరోపణలపై విచారణ జరుపుతాం : ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
ఎస్సీ, ఎస్టీలపై దాడులను ఉపేక్షించబోమని, ముఖ్యంగా మహిళలపై దాడులను నియంత్రించడానికి కఠినంగా వ్యవహరిస్తామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. త్వరలోనే లగచర్ల గ్రామంలో కమిషన్ పర్యటిస్తుందని, అక్కడ మహిళలపై అత్యాచార ఘటనలపై విచారణ జరుపుతామన్నారు. బీఆర్‌ఎస్ నాయకుల ఆధ్వర్యంలో లగచర్ల బాధితులు శనివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులను కమిషన్ కార్యాలయంలో కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోబోమని తెలిపారు. ఫార్మా కంపెనీతో భూములు కోల్పోతున్న గ్రామస్తులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు.
పోలీసులపై అత్యాచార కేసులు నమోదు చేయాలి
అధికారులపై దాడులు చేశారనే నెపంతో లగచర్ల మహిళలపై పోలీసులు లైంగిక దాడికి పాల్పడ్డారని, వారిపై అత్యాచార కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ను కోరారు. బాధితులతో కలిసి కమిషన్ చైర్మన్, సభ్యులను కలిసి వారు బాధితుల గోడు వివరించారు. పోలీసులు అర్ధరాత్రి తమ ఇండ్లపైకి వచ్చి లైంగికంగా వేధించారని, నోటికి వచ్చినట్టు బూతులు తిట్టారని మహిళలు వివరించారు. పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు అత్యాచార సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. కమిషన్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి దురహంకార పాలనకు లగచర్లలో పోలీసుల అమానుష దాడే ఉదాహరణ అన్నారు. సొంత నియోజకవర్గంలోని ప్రజలనే మెప్పించలేని రేవంత్ రెడ్డి ఇక రాష్ట్ర ప్రజలను ఏం మెప్పిస్తాడని ప్రశ్నించారు. ఫార్మా కంపెనీతో తమ జీవితాలు ఆగమవుతాయని అక్కడి ప్రజలంతా ఆందోళనలో ఉన్నారని తెలిపారు. అధికారులపై కడుపు కాలి తిరగబడ్డ వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. లగచర్లలో అధికారులపై కాదు గిరిజనులపైనే దాడి జరిగిందని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మహిళలతో పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని, లైంగిక వేధింపులకు గురి చేశారని తెలిపారు. బాధితులకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ న్యాయం చేస్తుందన్న నమ్మకం తమకు ఉందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలపై చేస్తున్న దమనకాండను ప్రజలంతా చూస్తున్నారని సమయం వచ్చినప్పుడు తగిన రీతిలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కమిషన్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, నాయకులు జాన్సన్ నాయక్, రూప్ సింగ్ తదితరులు ఉన్నారు.