దారుణం - కూతురి ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తండ్రి
తండ్రిగా కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన స్థానంలో ఉన్న ఓ వ్యక్తి కుమార్తె ప్రైవేటు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలు వైరల్ కావడంతో మనస్థాపం చెందిన కూతురు ఆత్మహత్యకు ప్రయత్నించింది.
తండ్రిగా కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన స్థానంలో ఉన్న ఓ వ్యక్తి కుమార్తె ప్రైవేటు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలు వైరల్ కావడంతో మనస్థాపం చెందిన కూతురు ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ దారుణ సంఘటనపై బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.
ఉడుపిలో నివసించే ఓ వ్యక్తి కుమార్తె (18) తమ బంధువైన ఓ యువకుడిని ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని విషయాన్ని పెద్దల దృష్టికి తెచ్చారు. అయితే వీరి ప్రేమ వ్యవహారం యువతి తండ్రికి నచ్చలేదు. సదరు యువకుడిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించలేదు. ఈ విషయమై రోజూ కుమార్తెను వేధింపులకు గురి చేసేవాడు. అడ్డు చెప్పడానికి వచ్చిన తల్లిని కూడా కొట్టేవాడు. కుమార్తెను ప్రేమించిన యువకుడిని ఇంటికి పిలిపించి అతడిపై కూడా దాడి చేశాడు.
అతడి సెల్ ఫోన్ లో తన కుమార్తెకు సంబంధించిన ప్రైవేటు వీడియోలు ఉండడం గుర్తించి ఆ వీడియోలను తీసుకున్నాడు. కన్న కుమార్తె ప్రైవేటు వీడియోలు అని కూడా చూడకుండా సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేశాడు. ఈ వీడియోలు వైరల్ కావడంతో యువతి అవమానం భరించలేక ఆత్మహత్యకు ప్రయత్నించింది. బంధువులు గుర్తించి ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడింది.
తన కుమార్తె ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని, వేధింపులకు గురి చేస్తున్నాడని భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కన్న కూతురి ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.