పోలీసుల్లా వచ్చారు.. రూ.80 లక్షలు దోచేశారు.. - బెంగళూరులో ఘటన
దోపిడీకి పాల్పడిన నిందితులు తెలుగులో మాట్లాడుతున్నారని, చందన్, కుమారస్వామి పోలీసులకు వివరించారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. నలుగురు వ్యక్తులు.. ఒకరు ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు.. బెంగళూరు నగరంలోని కేహెచ్ రోడ్డు జంక్షన్ వద్ద మాటేశారు. అనేక కార్లు వెళ్తున్నా.. గుర్తుపట్టినట్టుగా.. అటుగా వస్తున్న ఓ కారును ఆపారు. వివరాలు అడుగుతూ.. డ్రైవర్‌ని, కారులో ఉన్న మరో వ్యక్తిని కారు నుంచి బయటికి రప్పించారు. అనంతరం వారిపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. అనంతరం కారులో తరలిస్తున్న రూ.80 లక్షల నగదును తీసుకుని కారుతో పాటు ఉడాయించారు.
ఈ ఘటనకు సంబంధించి.. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తుమకూరు జిల్లా తెవడహళ్లిలో వక్కల మండీ యజమాని మోహన్ తన డ్రైవరు చందన్, ఉద్యోగి కుమారస్వామికి శుక్రవారం రూ.80 లక్షల నగదును ఇచ్చి కారులో సేలంకి తీసుకెళ్లాలని, అక్కడికెళ్లాక ఫోన్ చేయాలని చెప్పాడు. వారు ఆ నగదు తీసుకుని కారులో తుమకూరు నుంచి బయలుదేరారు.
కారు బెంగళూరు కేహెచ్ రోడ్డు జంక్షన్ వద్దకు రాగానే ఒక ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు కారును ఆపారు. కారులోని వారిపై దాడి చేసి డబ్బు తీసుకుని కారుతో పాటు ఉడాయించారు. దీంతో బాధితులు వెంటనే తమ యజమాని మోహన్‌కి ఫోన్ చేసి జరిగిన ఘటనను వివరించారు. ఆయన సూచన మేరకు విల్సన్ గార్డెన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దోపిడీకి పాల్పడిన నిందితులు తెలుగులో మాట్లాడుతున్నారని, చందన్, కుమారస్వామి పోలీసులకు వివరించారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. మోహన్ ఆర్థిక వ్యవహారాల గురించి తెలిసినవారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.