పవన్ కళ్యాణ్‌ను చంపేస్తానని బెదిరించిన వ్యక్తి అరెస్టు
మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ చేసినట్టు అనుమానం?
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను చంపేస్తానని బెదిరిస్తూ ఆయన పేషీకి ఫోన్లు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని నూక మల్లికార్జున రావుగా గుర్తించారు. మద్యం మత్తులోనే అలాంటి కాల్స్ చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. రహస్య ప్రదేశంలో మల్లికార్జునరావును విచారిస్తున్నారు. ఏపీ సెక్రటేరియట్‌లోని పవన్ కళ్యాణ్ పేషీకి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి పవన్‌ను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. బెదిరింపు కాల్స్ విషయాన్ని ఆయన పేషీ సిబ్బంది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై దృష్టి సారించిన పోలీసులు బెదిరింపు కాల్స్ చేసిన మొబైల్ నంబర్ ఎన్‌టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన మల్లికార్జునరావు పేరుపై ఉన్నట్టు గుర్తించారు. అప్పటికే మొబైల్‌ను స్విచ్ ఆఫ్ చేయడంతో నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. మంగళవారం తిరువూరులోనే మల్లికార్జునరావును అదుపులోకి తీసుకున్నారు.