ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నకు బెయిల్ ముంజూరు
పిటిషనర్ ను ఇంకా జైలులో ఉండాల్సిన అవసరం కనిపించలేదన్న సుప్రీం ధర్మాసనం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి రెగ్యులర్ బెయిల్ లభించింది. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అదనపు ఎస్పీ మేకల తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ ముంజూరు చేసింది . తిరుపతన్న గతంలో బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినా చుక్కెదురైంది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బి.వి. నాగరత్న నేతృత్వంలోని ధర్మాసరం నేడు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ 10 నెలలుగా జైల్లో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేశారు. అందులో పిటిషనర్ ఇంకా జైలులో ఉండాల్సిన అవసరం కనిపించలేదని పేర్కొన్నది. ట్రయల్‌కు పూర్తిగా సహకరించాలని, జాప్యం చేయడానికి యత్నించవద్దని హెచ్చరించింది. సాక్షులను ప్రభావితం చేసినా, ఆధారాలు చెరిపేయడానికి ప్రయత్నించినా రాష్ట్ర ప్రభుత్వం రద్దుకు కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. పాస్ పోర్టు రద్దు సహా ఇతర బెయిల్ షరతులు అన్ని ట్రయల్ కోర్టు ఇస్తుందని న్యాయస్థానం తెలిపింది. ఈ కేసులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదించారు.ఫోన్ ట్యాపింగ్‌లో తిరుపతన్నే ప్రధాన నిందితుడని ఆయన తెలిపారు. దీనిలో ఆయన పాత్రపై దర్యాప్తునకు మరో 4 నెలల సమయం పడుతుందన్నారు. కొంతమంది కీలక సాక్షులను ఇంకా విచారించాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో తిరుపతన్నకు బెయిల్ ఇవ్వొవద్దని వాదించారు. పిటిషనర్ తరఫున సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు.ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం తిరుపతన్నకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.