మహా కుంభమేళాలో తొక్కిసలాట.. 15 మంది మృతి

యూపీ సీఎం యోగికి ప్రధాని మోదీ ఫోన్‌.. పరిస్థితిపై ఆరా

Advertisement
Update:2025-01-29 08:13 IST

మౌని అమావాస్య సందర్భంగా మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ప్రయాగ్‌రాజ్‌కు మంగళవారం అర్ధరాత్రి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడం.. అందరూ త్రివేణి సంగమం, గంగా ఘాట్‌ లోనే స్నానాలకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. ఈక్రమంలో తొక్కిసలాట జరిగింది. భక్తులను కంట్రోల్‌ చేసేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లు విరిగిపోయాయి. దీంతో ఘాట్‌ల వైపు మరింత మంది భక్తులు దూసుకువచ్చారు. తొక్కిసలాటలో 15 మంది వరకు మృతిచెందారని, మరో 30 మంది భక్తులకు గాయాలయ్యాయని అక్కడ వైద్య సేవలు అందిస్తోన్న ఒక డాక్టర్‌ నేషనల్‌ మీడియాకు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెప్తున్నారు. గాయపడ్డవారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. తొక్కిసలాట నేపథ్యంలో బుధవారం అమృతస్నానం కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు అఖాడాలు ప్రకటించారు.


 



యూపీ సీఎం యోగికి ప్రధాని మోదీ ఫోన్‌

మహాకుంభమేళాలో తొక్కిసలాటపై ప్రధాని నరేంద్రమోదీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్‌ కు చేశారు. కుంభమేళాలో పరిస్థితి ఎలా ఉందని ఆరా తీశారు. ఘటన ఎలా జరిగింది, ఎంత మంది మృతిచెందారు.. గాయపడ్డ వారికి ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగుకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యూపీ సీఎం యోగితో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఫోన్‌ లో మాట్లాడి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు. భక్తులు ఎలాంటి వదంతులు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. గంగా ఘాట్‌ వద్దకు స్నానానికి వెళ్లొద్దని అప్పీల్‌ చేశారు. త్రివేణి సంగమం వైపు కూడా వెళ్లేందుకు ప్రయత్నించొద్దన్నారు. భక్తులు అధికారుల సూచనలు పాటిస్తూ సహకరించాలన్నారు.

Tags:    
Advertisement

Similar News