క్రికెటర్లను తాకిన పోంజీ స్కామ్ సెగ
శుభ్‌మన్ గిల్‌తో పాటు సాయి సుదర్శన్, రాహుల్ తెవాతియా, మోహిత్ శర్మ ఇందులో పెట్టుబడి పెట్టినట్లు సమాచారం
గుజరాత్‌తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పోంజీ స్కామ్ సెగ క్రికెటర్లనూ తాకింది. బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తామని ప్రజలను మోసం చేసి రూ. 6 వేల కోట్లను సేకరించిన బీజెడ్ గ్రూప్ సీఈవో భూపేంద్ర సింగ్ ఝలాను ఇప్పటికే గుజరాత్ సీఐడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు సాయి సుదర్శన్, రాహుల్ తెవాతియా, మోహిత్ శర్మ వంటి పలువురు ఇందులో పెట్టుబడి పెట్టినట్లు తాజాగా బైటికివచ్చింది.
బీజెడ్ గ్రూప్‌నకు చెందిన రూ. 450 కోట్లకు సంబంధించి లావాదేవీలపై సీఐడీ ఆరా తీస్తున్నది. ఇందులోభాగంగా గుజరాత్ క్రికెటర్లకు సమన్లు జారీ చేయనున్నది. వారి నుంచి వివరాలు సేకరించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నది. అహ్మదాబాద్ మిర్రర్ నివేదిక ప్రకారం.. ఇందులో గిల్ రూ. 1.95 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు పేర్కొన్నది. అతడు కాకుండా.. మిగతా క్రికెటర్లు తక్కువ మొత్తాల్లో ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అది ముగిసి భారత్‌కు వచ్చాక గిల్‌కు సమన్లు జారీ చేసి.. విచారణ చేపట్టే అవకాశం ఉన్నది.