భార్య యూట్యూబ్ ఛానల్ వ్యూస్ కోసం ఆ భర్త చేసిన పనితెలిస్తే షాక్..

తన భార్య యూట్యూబ్ ఛానల్‌కు వ్యూస్ పెరిగి మానిటైజేషన్ రావాలనే ఉద్దేశంతో ఓ ప్రభుత్వ టీచర్ చెత్తపని చేశాడు.

Advertisement
Update:2024-04-07 14:47 IST

తన భార్య యూట్యూబ్ ఛానల్‌కు వ్యూస్ పెరిగి మానిటైజేషన్ రావాలనే ఉద్దేశంతో ఓ ప్రభుత్వ టీచర్ చెత్తపని చేశాడు. ఏకంగా పరీక్షా పత్రాలనే భార్య యూట్యూబ్ ఛానల్లో అప్‌లోడ్ చేశాడు. దీంతో వ్యూస్ , డబ్బుల సంగతేమో గానీ విషయం పైఅధికారుల దృష్టికి వెళ్ళగా పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది. సోషల్ మీడియాతో టైం పాస్ చేసే రోజులు దాటి వాటితోనే చాలా మంది డబ్బులు సంపాదిస్తూ జీవనం సాగిస్తున్నారు. అందులో యూట్యూబ్‌ది మరో ప్రత్యేక పాత్ర.

యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్స్‌గా లక్షలు లక్షలు సంపాదిస్తున్నవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటివారిని ఆదర్శంగా తీసుకుని.. చాలా మంది తమకు తెలిసిన పనికే కొంత సృజనాత్మకతను జోడించి యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది .. కానీ కొందరు మాత్రం వీడియొలకోసం చెత్తపనులు చేసి దెబ్బలు తగిలించుకుంటుంటే ఇంకొందరు మరీ రెచ్చిపోయి పిచ్చి పనులు చేసి జైలుపాలవుతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఒడిశాలో జజ్‌పూర్ జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది.

జిల్లాలో 1 నుంచి 8వ తరగతి వరకూ ప్రశ్న పత్రాలు లీక్ అయినట్టు అధికారులకి సమాచారం అందింది. దీంతో రంగంలోకి దగిన పోలీసులకు ఆశ్చర్యం కలిగించే ఓ విషయం బయటపడింది. పోలీసుల వివరాల ప్రకారం జిల్లాల్లోని గోపీనాథ్ జ్యూ నోడల్ స్కూల్‌లో జగన్నాథ్ కార్ అనే వ్యక్తి అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తున్నాడు.

పరీక్షలకు దాదాపు వారం రోజుల ముందు మార్చి 9న నిందితుడు క్లస్టర్ రీసెర్చ్ కోఆర్డినేటర్ నుంచి ఇటారా ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ తరుపున ప్రశ్నపత్రాలు తీసుకున్నాడు . వాటిని నేరుగా స్కూలుకు తీసుకెళ్లకుండా ఇంటికి తీసుకొచ్చి ఫోన్‌తో ఫొటోలు తీసి తన భార్య యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశాడు.

ఫలితంగా వారి ఛానల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఒక్కసారిగా 5 వేల నుంచి 30 వేలకు చేరుకుందని పోలీసులు చెబుతున్నారు. అయితే యూట్యూబ్ ద్వారా నిందితులు ఏమన్నా డబ్బు సంపాదించారో లేదో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ కేసులో పోలీసులు ప్రభుత్వ టీచర్ భార్య పేరును కూడా కుట్రదారుగా చేర్చారు. అయితే, ఆమె పసిబిడ్డ తల్లి కావడంతో ఇంకా అదుపులోకి తీసుకోలేదని సమాచారం.

Tags:    
Advertisement

Similar News