సంగారెడ్డి జైలర్ సంజీవ రెడ్డి సస్పెన్షన్
గుండెపోటు వచ్చిన రైతును బేడీలతో ఆస్పత్రికి తరలించినందుకు పనిష్మెంట్
గుండెపోటు వచ్చిన లగచర్ల గ్రామానికి చెందిన గిరిజన రైతు హీర్యా నాయక్ ను బేడీలతో ఆస్పత్రికి తరలించిన సంఘటనలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ ఘటనకు బాధ్యుడిగా పేర్కొంటూ సంగారెడ్డి జైలర్ సంజీవ్ రెడ్డిని సస్పెండ్ చేసింది. విధి నిర్వహపణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంగారెడ్డి జైలు సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ రాయ్‌పై శాఖ పరమైన చర్యలు చేపట్టాలని జైళ్ల శాఖ డీజీ హోం శాఖ స్పెషల్ సీఎస్ కు విజ్ఞప్తి చేశారు. గిరిజన రైతును బేడీలతో ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటనపై జైళ్ల శాఖ డీజీ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. లగచర్లలో ఫార్మా విలేజ్ భూసేకరణకు వ్యతిరేకంగా కలెక్టర్ పై దాడి కేసులో హీర్యా నాయక్ అండర్ ట్రయల్ ఖైదీగా సంగారెడ్డి జైలులో ఉన్నారు. బుధవారం రాత్రి ఆయనకు గుండెలో నొప్పి వచ్చినా హాస్పిటల్‌కు తీసుకెళ్లకుండా అధికారులు నిర్లక్ష్యం చేశారు. గురువారం ఉదయం మరోసారి గుండెపోటు రావడంతో చేతులకు బేడీలు, గొలుసుతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ప్రతిపక్ష నాయకులు ఈ అమానవీయ ఘటనపై మండిపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఈక్రమంలోనే ప్రాథమిక విచారణ పూర్తి చేసిన ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.