కోల్‌కత్తా హత్యాచార ఘటన: నేడు కోర్టు తీర్పు వేళ డాక్టర్ తండ్రి కీలక వ్యాఖ్యలు
నేడు తీర్పు వెలువరించనున్న సిల్దా కోర్టు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీకర్ ఆస్పత్రి జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై సిల్దా కోర్టు నేడు తీర్పు వెలువరించనున్నది. ఈకేసులో ఈ నెల 9న కోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన బాధితురాలి తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు కోర్టులో జరుగుతున్న విచారణకు సీబీఐ తమను పిలవలేదని పేర్కొన్నారు.. తమ లాయర్ కూడా కోర్టుకు వెళ్లొద్దని చెప్పారని తెలిపారు. సీబీఐ అధికారులు ఒకటి, రెండు సార్లు మాత్రమే మా ఇంటికి వచ్చారు. విచారణ ఎంత వరకు వచ్చిందని ప్రశ్నిస్తే జరుగుతున్నదని చెప్పారు తప్పితే ఎటువంటి వివరాలు మాకు తెలియజేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా కూతురి గొంతుపై గాయాలున్నా స్వాబ్ సేకరించలేదన్నారు. కేసు ఛేదించడానికి సీబీఐ ఎక్కువగా ప్రయత్నించలేదని ఆరోపించారు. ఈ ఘటనలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు డీఎన్‌ఏ రిపోర్టులో వెల్లడైందని అధికారులు పేర్కొన్నారని తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన వారికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
కోల్‌కతాలోని ఆర్జీకార్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆగస్గు 9న జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన పెను సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ ఘటన జరిగి 162 రోజుల తర్వాత ఈ కేసుపై నేడు తీర్పు వెలువడనున్నది. ఘటనపై విచారణ చేస్తున్న కోల్‌కతా పోలీసులు కేసును తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపణలు రావడంతో ఆగస్టు 13న కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐ స్వీకరించింది. దర్యాప్తులో భాగంగా 120 మందికిపైగా సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది. దీనిలో భాగంగా ప్రత్యేక కోర్టుకు అభియోగాలు సమర్పించింది. ఈ కేసులో ప్రధాన సంజయ్ రాయ్ ఒక్కడే ఈ నేరానికి పాల్పడినట్లు చెబుతున్నది. తీర్పు తేదీ దగ్గర పడిన వేళ నిందితుడు సంజయ్ రాయ్ ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు జైలు వర్గాలు చెబుతున్నాయి. ఆహారం, మందులు తీసుకోవడం నిందితుడు తగ్గించాడని పేర్కొన్నది. నిందితుడిని ప్రత్యేక సెల్ ఉంచి నిరంతరం నిఘా ఉంచారు. అతని కార్యకలాపాలు పర్యవేక్షించడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.