తప్పుడు జామీను పత్రాల ముఠా గుట్టురట్టు
తక్కువ ఖర్చుతో జామీను పత్రాలు అందిస్తుండటంతో వీరి కార్యకలాపాలు అతి తక్కువ కాలంలోనే వివిధ ప్రాంతాలకు విస్తరించాయి.
ఏదైనా కేసులో అరెస్టయిన నిందితులు బెయిల్ కోసం దరఖాస్తు చేసి జామీను పత్రాలను పోలీస్ స్టేషన్‌లో అందించడం ద్వారా విడుదల కావడం సహజమే. అయితే నిందితుల నేరాన్ని బట్టి బెయిల్ మంజూరు చేయాలా.. వద్దా.. అనేది నిర్ణయిస్తుంటారు. కానీ, వీరు మాత్రం తప్పుడు జామీను పత్రాలు సృష్టించేస్తున్నారు. తక్కువ డబ్బు తీసుకుంటూ నిందితులు బెయిల్ పొందేలా సహకరిస్తున్నారు. కరడుగట్టిన నేరస్తుల విడుదలకు కూడా ఈ విధంగా తోడ్పడుతున్నారు. ఏకంగా ఇదే తమ ఉపాధిగా మలుచుకున్నారు. వీరి బాగోతాన్ని పోలీసులు గుర్తించడంతో ఈ ముఠా గుట్టు రట్టయింది.
నల్గొండ జిల్లాలోని ఓ కోర్టులో వేములపల్లి మండలానికి చెందిన మామిడి భానుప్రకాష్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేశాడు. కోవిడ్ సమయంలో ఒప్పంద ఉద్యోగులను తొలగించడంతో అతని ఉద్యోగమూ పోయింది. కోర్టులో పనిచేసిన అనుభవంతో అతను తప్పుడు జామీను పత్రాలను తయారు చేయడం ఉపాధిగా మలుచుకున్నాడు.
ఇందుకు చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన కస్తాల గోపయ్య, కస్తాల నాగరాజు, కస్తాల నాగేశ్వరరావు, మునగలేటి లింగయ్యల సహకారం తీసుకుంటున్నాడు. ఇలా జామీను పత్రాలు అందించి కరడు గట్టిన నేరస్తులైన వేముల కోటేశ్, జాదేవ్ గణేశ్, కిన్నెర మధుతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన గంజాయి కేసుల్లో నిందితులకు సైతం బెయిల్ వచ్చేందుకు వీరు సహకరిస్తున్నారు. ఇందుకు గాను ఒక్కో జామీనుకు రూ.5 వేల రూపాయలు నిందితులు వసూలు చేస్తున్నారు.
తక్కువ ఖర్చుతో జామీను పత్రాలు అందిస్తుండటంతో వీరి కార్యకలాపాలు అతి తక్కువ కాలంలోనే వివిధ ప్రాంతాలకు విస్తరించాయి. తొలుత నల్గొండ, సూర్యాపేట జిల్లాలకే పరిమితమైన వీరి కార్యకలాపాలు.. డిమాండ్ పెరగడంతో కోదాడ, మిర్యాలగూడ, నిడమానూరు, ఖమ్మం, జగ్గయ్యపేట, నందిగామ, రాజమండ్రి, విజయవాడ కూ విస్తరించాయి. ఆయా కోర్టుల్లోనూ తప్పుడు పత్రాలు సమర్పించి బెయిల్ మంజూరయ్యేలా వీరు సహకరించారని కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి శుక్రవారం వెల్లడించారు.
ప్రధాన నిందితులు సహా 24 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేసినట్టు చెప్పారు. మరో 22 మంది పరారీలో ఉన్నారని తెలిపారు. కోర్టుకు అవసరమైన వివిధ రకాల పేపర్లు, స్టాంపులు, రసీదులు ముద్రించి, తయారు చేసి ఇస్తున్న మిర్యాలగూడకు చెందిన పిల్లలమర్రి శ్రీనివాస్, చీదెళ్ల రవి, రేకప్ ఈశ్వర్‌లను కూడా అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ వెల్లడించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కేసులో విచారణ జరుగుతోందని, ఈ వ్యవహారంలో పలువురు న్యాయవాదులు కూడా ఉన్నారని డీఎస్పీ తెలిపారు. విచారణ అనంతరం వారిని కూడా అరెస్ట్ చేస్తామని ఆయన వెల్లడించారు.