పాకిస్థాన్ రైల్వేస్టేషన్‌లో పేలుడు
ఈ ఘటనలో 25 మంది మృతి.. 46 మందికి తీవ్ర గాయాలు
పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని క్వెట్టా రైల్లే స్టేషన్‌లో భారీ బాంబు పేలుడు సంభవించి 25 మంది దుర్మరణం చెందారు. క్వెట్టా నుంచి పెషావర్‌కు జాఫర్ ఎక్స్‌ప్రెస్ బయలు దేరే సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. ప్లాట్‌ఫామ్‌పై పెద్ద సంఖ్యలో ప్రయాణికులతో రద్దీగా ఉండే సమయంలో శక్తివంతమైన బాంబు పేలుడు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.ఈ ఘటనలో 25 మంది మృతి చెందగా.. ఇందులో 14 మంది ఆర్మీ సైనికులు ఉన్నారు. 46 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
పేలుడు ధాటికి ప్లాట్‌ఫామ్ పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు జరిగిన సమయంలో రైల్వే స్టేషన్‌లో 100 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ఆధారాలు సేకరించిందని వెల్లడించారు. అయితే ఇది ఆత్మహుతి దాడిలా కనిపిస్తున్నదని... ఇప్పుడే పూర్తిస్థాయి నిర్ధారణకు రాలేమని అధికారులు తెలిపారు.పేలుడు సమయంలో ప్లాట్‌ఫామ్ నుంచి ఓ రైలు కదలడానికి సిద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ పని తమదేనని వేర్పాటువాద గ్రూప్ అయిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించిందని కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి.