'బికినీ కిల్లర్' చార్లెస్ శోభరాజ్‌ను విడుదల చేయనున్న నేపాల్ ప్రభుత్వం

తీహార్ జైలులో గార్డులకు బర్త్ డే పార్టీ అని చెప్పి.. మత్తు మందు ఇచ్చి తప్పించుకున్నాడు. ఆ తర్వాత 22 రోజులకు గోవాలో పార్టీ చేసుకుంటూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు.

Advertisement
Update:2022-12-22 10:30 IST

చార్లెస్ శోభరాజ్.. ఈ పేరు ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ డెబ్బై, ఎనభయ్యవ దశకంలో ఈ పేరు వినని వాళ్లు ఉండరు. మహిళా విదేశీ పర్యాటకులకు ఈ పేరు వింటే హడల్. ఒక బ్యాగ్ తగిలించుకొని ప్రపంచ యాత్రలు చేసే ఆడవాళ్లే శోభరాజ్ లక్ష్యంగా ఉండే వారు. అతను దాదాపు 15 నుంచి 20 హత్యలు చేసి ఉంటాడని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఆడవారిలో బికినీలు ధరించిన వారినే టార్గెట్ చేసేవాడు. హత్య అనంతరం అక్కడి నుంచి పాములా తప్పించుకునేవాడు. అందుకే అతడికి బికినీ కిల్లర్, ది సర్పెంట్ (పాము) అనే నిక్ నేమ్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం నేపాల్‌లోని ఖాట్మాండ్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 78 ఏళ్ల శోభరాజ్‌ను విడుదల చేయాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఫ్రెంచ్ జాతీయుడైన శోభరాజ్.. తండ్రి భారతీయుడు కాగా తల్లి వియత్నాంకు చెందిన వ్యక్తి. అతని అసలు పేరు చార్లెస్ గురుముఖ్ శోభరాజ్. హిప్పీలు అంటే విపరీతమైన ద్వేషం పెంచుకున్న శోభరాజ్.. పాశ్చాత్య దేశాలకు చెందిన మహిళా పర్యాటకులను టార్గెట్ చేసి హత్య చేసేవాడు. అప్పట్లో అతడు ఇండియా, నేపాల్‌లో చేసిన సీరియల్ కిల్లింగ్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. 1976లో ఇండియాలో పట్టుబడిన చార్లెస్ శోభరాజ్‌కు కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే తీహార్ జైలులో గార్డులకు బర్త్ డే పార్టీ అని చెప్పి.. మత్తు మందు ఇచ్చి తప్పించుకున్నాడు. ఆ తర్వాత 22 రోజులకు గోవాలో పార్టీ చేసుకుంటూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. తిరిగి అతడిని తీహార్ జైలులో వేయగా.. 1997లో రిలీజ్ అయ్యాడు. అనంతరం ఫ్రాన్స్ వెళ్లాడు.

జైలులో ఉండగానే పెద్ద సెలబ్రిటీలా మారిపోయాడు. పత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం.. తన జీవిత చరిత్ర బుక్స్ రాసే వాళ్ల దగ్గర, సినిమాలు తీస్తా అన్న వాళ్ల దగ్గర కాపీ రైట్స్ కింద భారీగా డబ్బులు వసూలు చేశాడు. ఫ్రాన్స్ వెళ్లిన తర్వాత కూడా అతడికి పెద్ద సెలెబ్రిటీ హోదా లభించింది. తనను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమా వచ్చింది. అప్పటికే నేపాల్ పోలీసులు 1975లో చేసిన రెండు హత్య కేసుల్లో అతడి కోసం వేటాడుతున్నారు. అయితే నేపాల్ ప్రభుత్వానికి అతను ఫ్రాన్స్‌లో ఉన్నాడని తెలిసినా.. రప్పించలేక పోయింది.

చార్లెస్ శోభరాజ్ తెలివిగా హత్యలు చేసి తప్పించుకునేవాడు. కానీ అతడి అతి విశ్వాసమే అతడిని తిరిగి పట్టించింది. తనను ఎవరూ పట్టుకోలేరనే ధీమాతో 2003లో నేపాల్ వెళ్లాడు. ఖాట్మాండులోని ఒక క్యాసినోలో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అమెరికాకు చెందిన కానీ జో బ్రాంజిచ్‌ను 1975లో నేపాల్‌లో హత్య చేశాడు. అలాగే కెనడాకు చెందిన పర్యాటకురాలు లారెంట్ కారియర్ అనే మహిళలను కూడా హత్య చేసినట్లు రుజువు అయ్యింది. అమ్మాయిలతో ముందుగా ఫ్రెండ్‌షిప్ చేసి ఆ తర్వాత వారికి డ్రగ్స్ ఇచ్చి హత్య చేసేవాడు. అతడి క్రూరత్వాన్ని నిరూపించడంలో నేపాల్ పోలీసులు సఫలం అయ్యారు. దీంతో జీవిత ఖైదు పడింది.

నేపాల్‌లో జీవిత ఖైదు అంటే కనీసం 20 ఏళ్లు జైలులో ఉండాలి. అయితే సీనియర్ సిటిజన్లు మంచి ప్రవర్తనతో 75 శాతం శిక్షను పూర్తి చేస్తే విడుదల అయ్యే అవకాశం ఉన్నది. చార్లెస్ ఇప్పటికే 95 శాతం శిక్షను పూర్తి చేసుకున్నాడు. దీంతో నేపాల్ సుప్రీంకోర్టులో శోభరాజ్ విడుదల కోసం పిటిషన్ దాఖలు చేశాడు. జస్టిస్ ప్రధాన్ మల్ల, జస్టిస్ తిలక్ ప్రసాద్‌తో కూడిన ధర్మాసనం అతడిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అంతే కాకుండా శోభరాజ్ 15 రోజుల్లోగా ఫ్రాన్స్ వెళ్లిపోవాలని చెప్పింది.

నెట్‌ఫ్లిక్స్‌లో వెబ్ సిరీస్..

చార్లెస్ శోభరాజ్ యవ్వనంలో ఉన్నప్పుడు చాలా అందంగా ఉండేవాడు. అతను చేసిన సీరియల్ కిల్లింగ్స్ అన్నీ 1970 నుంచి 76 మధ్యే జరిగాయి. నేపాల్, ఇండియా, థాయ్‌లాండ్‌లో ఈ హత్యలు చేసినట్లు దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. అతని హత్యల నేపథ్యంలో అనేక పుస్తకాలు వెలువడ్డాయి. బాలీవుడ్‌లోఅనేక సినిమాలకు అతడు ప్రేరణగా నిలిచాడు. గత ఏడాది నెట్‌ఫ్లిక్స్ 'ది సర్పెంట్' పేరుతో వెబ్‌సిరీస్ విడుదల చేసింది. అలాగే 2015లో రణ్‌దీప్ హుడా 'మై ఔర్ చార్లెస్' సినిమాలో శోభరాజ్ పాత్రను పోషించాడు.

Tags:    
Advertisement

Similar News