గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై నేషనల్ ఎస్సీ కమిషన్ సీరియస్
15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని గురుకులాల సెక్రటరీ ఆదేశం
ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు మృతి చెందిన ఘటనలపై నేషనల్ ఎస్సీ కమిషన్ సీరియస్ అయ్యింది. ఇప్పటి వరకు తెలంగాణ ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ సొసైటీల పరిధిలో ఎన్ని ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకున్నాయి.. బాధితులెంత మంది, ఈ ఘటనల్లో ఎంత మందిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నారనే సమగ్ర వివరాలు 15 రోజుల్లో ఇవ్వాలని ఎస్సీ, ఎస్టీ గురుకులాల సెక్రటరీని ఆదేశించారు. నేషనల్ ఎస్సీ కమిషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ జ్యూరిస్‌డిక్షన్ డైరెక్టర్ డాక్టర్ జి. సునీల్ కుమార్ బాబు సోమవారం గురుకులాల సెక్రటరీకి లేఖ రాశారు. గురుకులాల్లో ఏ తేదీల్లో ఫుడ్ పాయిజన్ లేదా ఇతర కారణాలతో విద్యార్థులు మృతి చెందారు.. బాధితుడి పూర్తి వివరాలు.. అందుకు ఎవరిని బాధ్యుడిగా గుర్తించారు.. ఎఫ్‌ఐఆర్ నంబర్, ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.. ఎందరిని నిందితులుగా గుర్తించారు.. వారిపై చార్జిషీట్ నమోదు చేశారా.. గురుకులాలు సంబంధిత ఘటనపై ఏదైనా కమిటీ ద్వారా రిపోర్టు తెప్పించిందా?.. బాధిత కుటుంబానికి సంబంధిత జిల్లా కలెక్టర్ ఎంత మేరకు పరిహారం చెల్లించారు.. ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే సమగ్ర వివరాలతో నిర్దేశిత నమూనాలో నివేదిక సమర్పించాలని ఆదేశించారు.