దేశంలోనే ముంబయి సేఫ్ సిటీ
భద్రతపై విమర్శలు సరికాదు.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
దేశంలోనే మెట్రో సిటీల్లో ముంబయి మహానగరమే సేఫ్ సిటీ అని.. ఇక్కడ భద్రతపై ప్రతిపక్షాలు, సినీ ప్రముఖుల విమర్శలు సరికాదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. సైఫ్ అలీ ఖాన్‌పై దోపిడీ దొంగలు కత్తితో దాడి చేయడం, సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు, ఎన్‌సీపీ నేత బాబా సిద్ధిఖీని హత్య చేయడం లాంటి వరుస ఘటనలను ప్రస్తావిస్తూ ప్రతిపక్షాల నేతలు, సినీ ప్రముఖులు ముంబయిలో భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. సెలబ్రెటీలు, వీఐపీలకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఎలా అని ఆందోళన వ్యక్తం చేశారు. సైఫ్ అలీఖాన్‌పై దాడి సహా ఇటీవల జరిగిన ఘటనలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నది వాస్తవమేనని ఫడ్నవీస్ పేర్కొన్నారు. అలాగని ముంబయి సురక్షితమైనది కాదని ప్రచారం చేయడం మాత్రం మంచిది కాదన్నారు. ఇలాంటి ప్రచారం ముంబయి ప్రతిష్టను దెబ్బతీస్తుందని, దిగజార్చుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోనే ముంబయి అత్యంత సేఫ్ సిటీ అని.. దీనిపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు.