జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి
టీవీ చానెల్ మైక్‌తో దాడికి దిగిన నటుడు
జర్నలిస్టులపై ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు దాడికి దిగారు. మంగళవారం సాయంత్రం మంచు మనోజ్ ఆయన భార్య మౌనిక జల్‌పల్లిలోని మోహన్ బాబు నివాసానికి వెళ్లారు. ఇంట్లో ఉన్న తన కూతురును తీసుకెళ్లేందుకు గేట్లు తెరవాలని పలుమార్లు కోరినా సెక్యూరిటీ సిబ్బంది వినిపించుకోలేదు. దీంతో మనోజ్ గేట్‌ను తోసుకొని లోపలికి వెళ్లారు. ఈక్రమంలోనే ఆయన వెంట పలువురు మీడియా ప్రతినిధులు లోపలికి వెళ్లారు. అప్పటికే ఆవేశంతో ఊగిపోతున్న మోహన్ బాబు మంచు మనోజ్ పై దాడి చేశాడు. మోహన్ బాబు స్పందన కోరేందుకు మీడియా చానెళ్ల ప్రతినిధులు ప్రయత్నించగా ఒక టీవీ చానెల్ లో లోగోతో ఉన్న మైక్ తో మీడియా ప్రతినిధులను బూతులు తిడుతూ దాడికి తెగబడ్డారు. ఇద్దరు మీడియా ప్రతినిధులకు గాయాలయ్యాయి. అక్కడే ఉన్న జర్నలిస్టులు వారిని బయటకు తీసుకువచ్చారు. మీడియా ప్రతినిధులపై దాడిని జర్నలిస్టు సంఘాల నాయకులు ఖండించారు. మోహన్ బాబు హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తనపై జరిగిన దాడిపై మంచు మనోజ్ స్పందిస్తూ ఏసీపీ, పోలీసులు దగ్గరుండి తనపై దాడి చేయించారని, తన కూతురిని చూడనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోహన్ బాబు, మంచు విష్ణుల గన్ లు సీజ్ చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.