కరెంట్ బిల్ ఎక్కువొచ్చిందని.. మీటర్ రీడింగ్ తీసే వ్యక్తి హత్య

లక్ష్మీనారాయణ్ త్రిపాఠి మీటర్ రీడింగ్ తీసి సేథి చేతిలో పెట్టాడు. అయితే గతంలో కంటే ఎక్కువ బిల్లు వచ్చిందనే కారణంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

Advertisement
Update:2023-08-08 08:27 IST

అత్త మీద కోసం దుత్త మీద చూపినట్లు.. కరెంట్ బిల్ ఎక్కువొచ్చిందని.. మీటర్ రీటింగ్ తీసే వ్యక్తిని హత్య చేశాడో వ్యక్తి. ఈ సంఘటన ఒడిషాలోని గంజాంలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. గంజాం జిల్లా భాంజానగర్ ప్రాంతంలోని తారాసింగ్ పోలీస్ స్టేషన్ పరిధి కుపాటి గ్రామంలో లక్ష్మీనారాయణ్ త్రిపాఠి(52) అనే వ్యక్తి టాటా పవర్ సదరన్ ఒడిషా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (టీపీఎస్‌ఓడీఎల్)లో మీటర్ రీడింగ్ తీస్తుంటాడు. ఈ క్రమంలో ఆగస్టు నెలకు సంబంధించి రీడింగ్స్ తీసుకోవడానికి కుపాటి గ్రామానికి వెళ్లాడు. గోబింద్ సేథీ(60) అనే వ్యక్తి ఇంటికి పవర్ బిల్లు రీడింగ్ కోసం వెళ్లాడు.

లక్ష్మీనారాయణ్ త్రిపాఠి మీటర్ రీడింగ్ తీసి సేథి చేతిలో పెట్టాడు. అయితే గతంలో కంటే ఎక్కువ బిల్లు వచ్చిందనే కారణంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తాను మీటర్‌లో ఉన్న రీడింగే వేశానని.. మీరు ఎక్కువ వాడుకున్నందుకే బిల్లు అంతొచ్చిందని నారాయణ్ త్రిపాఠి సమాధానం ఇచ్చాడు. ఇదే విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. కోపంతో ఊగిపోయిన గోబింద్ సేథీ పదునైన ఆయుధంతో లక్ష్మీనారాయణ్‌పై దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన లక్ష్మీనారాయణను దగ్గరిలోని ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

ఈ సంఘటన అనంతరం గోబింద్ సేథీ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే స్థానికులు అతడిని పట్టుకొని దేహశుద్ది చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వెంటనే గోబింద్‌ను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. గొడవ, హత్య జరిగిన సమయంలో అక్కడే ఉన్న గోబింద్ సేథీ బంధువు తునీ సేథీ పూర్తి విరాలను పోలీసులకు చెప్పాడు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News