డిసెంబర్‌ 9న బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపు

బూటకపు ఎన్‌కౌంటర్‌ను నిరిసిస్తూ బంద్‌ పాటించాలని పిలుపు

Advertisement
Update:2024-12-05 20:54 IST

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చల్పాక సమీపంలో అడవుల్లో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌ ను నిరసిస్తూ ఈనెల 9న బంద్‌ కు పిలుపునిస్తున్నామని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్‌ గురువారం ఈమేరకు ప్రకటన విడుదల చేశారు. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో డిసెంబర్‌ ఒకటిన తెలంగాణ గ్రేహౌండ్స్‌ పోలీసులు ఏడుగురు విప్లవకారులకు విషమిచ్చి కిరాతకంగా చంపారని తెలిపారు. నవంబర్‌ 30న సాయంత్రం ఏడుగురు సభ్యులతో కూడిన దళం చల్పాక సమీపంలోని ఆదివాసీ గ్రామానికి వెళ్లిందని.. అక్కడ నమ్మిన వ్యక్తికి భోజనాలు ఏర్పాటు చేయాలని సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. అంతకుముందే పోలీసులకు అప్రూవర్‌గా మారిన సదరు ద్రోహి భోజనంలో విషం ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశారని తెలిపారు. స్పృహ కోల్పోయిన మావోయిస్టులను చిత్రహింసలకు గురి చేసి తెల్లవారుజామున 4 గంటలకు అతి సమీపం నుంచి కాల్చి చంపారని తెలిపారు. పోలీసుల కాల్పుల్లో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కురుసం మంగు అలీయాస్‌ బద్రు, జేఎండబ్ల్యూపీ డివిజన్‌ కమిటీ సభ్యుడు ఏగోలపు మల్లయ్య అలియాస్‌ మధు, ఇల్లెందు, నర్సంపేట ఏరియా కమిటీ సభ్యుడు ముచాకీ అందాల్‌ అలియాస్‌ కరుణాకర్‌, ఏరియా కమిటీ మెంబర్‌ ముచాకీ బామే అలియాస్‌ జమున, రిజనల్‌ కంపెనీ ప్లటూన్‌ కమిటీ సభ్యుడు పూనెం చోటు అలియాస్‌ కిశోర్‌, రెండో ప్లటూన్‌ కమిటీ సభ్యుడు కర్ణం కమాల్‌, ఏటూరునాగారం -మహదేవపూర్‌ ఏరియా కమిటీ సభ్యుడు జైసింగ్‌ మృతిచెందారని తెలిపారు. ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌ను ఖండిస్తూ డిసెంబర్‌ 9న రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిస్తున్నామని వెల్లడించారు. ప్రజలు ఈ బంద్‌ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్‌కౌంటర్‌పై న్యాయవిచారణ జరిపించి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ వారి లాభాల కోసమే పని చేస్తుందన్నారు. దామెరతోగు, రఘునాథపాలెం, పోల్ కమ్మ వాగులో వరుస ఎన్‌కౌంటర్లకు పాల్పడిందని వివరించారు.




 


Tags:    
Advertisement

Similar News