మరో వివాదంలో మంచు కుటుంబం
సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తున్న విష్ణు మేనేజర్ కిరణ్ మరో ఇద్దరితో కలిసి అడవి పందిని వేటాడి ఇంటికి తీసుకెళుతున్న వీడియో
కుటుంబ గొడవలతో వీధికెక్కిన సినీనటుడు మోహన్‌బాబు ఇంటి వివాదం మరింతగా ముదురుతున్నది. చిన్న కుమారుడు మంచు మనోజ్ ఫిర్యాదుపై పహాడీషరీఫ్ ఠాణాలో కేసు నమోదైన విషయం విదితమే. ఇది ఉండగానే.. తాజాగా మరో వివాదంలో మంచు కుటుంబం చిక్కుకున్నది. జల్‌పల్లి అటవీ ప్రాంతం పక్కనే ఆయన ఇల్లు ఉన్నది. అక్కడ నెమళ్లు, జింకలు, ఇతర వన్యప్రాణులు ఉన్నాయి. మోహన్‌బాబు పెద్ద కుమారుడు విష్ణుకు సంబంధించిన మేనేజర్ కిరణ్ మరో ఇద్దరితో కలిసి అడవి పందిని వేటాడి ఇంటికి తీసుకెళుతున్న వీడియో మంగళవారం సోషల్ మీడియాలో కలకలం సృష్టించింది.
దీనిపై నెటీజన్లు మండిపడుతున్నారు. వన్యప్రాణులను శిక్షిస్తే అటవీ అధికారులు ఎలా ఊరుకుంటున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమౌతున్నాయి. అడవి పందిని వేటాడి తీసుకెళ్లిన దృశ్యాలు తమదాకా వచ్చాయని, దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని పహాడీ షరీఫ్ ఇన్‌స్పెక్టర్ గురువారెడ్డి స్పష్టం చేశారు. వన్యప్రాణులను రక్షించాల్సిన బాధ్యత అధికారులకు లేదా అంటూ పలువురు మండిపడుతున్నారు.