మధ్యప్రదేశ్ లో ఘోరం .. 8 మంది కుటుంబీకులను నరికి చంపిన ఉన్మాది

ఈ దాడిలో అక్కడికక్కడే 8 మంది రక్తసంబంధీకులు చనిపోయారు. అప్పటిదాకా పచ్చగా కనిపించిన పెళ్లి పందిరి దాడితో రక్తసిక్తమైంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టానికి తరలించారు.

Advertisement
Update:2024-05-31 08:50 IST

మధ్యప్రదేశ్‌లో ఓ ఉన్మాది ఘాతుకానికి 8 మంది కుటుంబ సభ్యులు బలయ్యారు. ఆ ఉన్మాది గొడ్డలితో కుటుంబ సభ్యులను అత్యంత దారుణంగా నరికి చంపాడు. గురువారం చింద్వారా జిల్లాలో జరిగిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. దినేష్ సరయం(22) అనే యువకుడు కొంతకాలంగా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబసభ్యులు అతడికి చికిత్స చేయించారు. దినేష్ కోలుకున్నాడని భావించి ఈనెల 21న అతడికి కుటుంబీకులు వివాహం జరిపించారు.

గురువారం తెల్లవారుజామున బోదల్ కచర్ గ్రామంలో నూతన వధూవరులతో సహా కుటుంబ సభ్యులంతా ఉన్నారు. ఆ సమయంలో దినేష్ ఉన్నట్టుండి ఓ గొడ్డలి తెచ్చి నిద్రపోతున్న కుటుంబ సభ్యులను అత్యంత దారుణంగా తెగ నరికాడు.

ఈ దాడిలో అక్కడికక్కడే 8 మంది రక్తసంబంధీకులు చనిపోయారు. అప్పటిదాకా పచ్చగా కనిపించిన పెళ్లి పందిరి దాడితో రక్తసిక్తమైంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టానికి తరలించారు. నిందితుడు మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

దినేష్ చికిత్స తర్వాత బాగానే ఉన్నాడని.. పెళ్లి సమయంలో కూడా అలాంటి లక్షణాలు కనిపించలేదని బంధువులు చెప్పారు. పెళ్లయిన తర్వాతే దినేష్ లో మళ్ళీ ఉన్మాది లక్షణాలు బయటపడ్డట్లు వారు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల్ని చంపిన తర్వాత దినేష్ తన మామ ఇంటికి పారిపోయి అక్కడ కూడా మరో హత్య చేసే ప్రయత్నం చేశాడు. పదేళ్ల బాలుడిపై దాడి చేయగా.. అతడు గట్టిగా కేకలు పెట్టడంతో దినేష్ అక్కడి నుంచి పారిపోయాడు.

బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్ప‌త్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఉన్మాది చేతిలో హత్యకు గురైన కుటుంబ సభ్యులందరికీ గురువారం సాయంత్రం సామూహికంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషాద సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ బాలుడి వైద్య చికిత్స కోసం రూ. 5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News