ప్రముఖ గాయకుడు జయచంద్రన్ కన్నుమూత
దిగ్గజ మలయాళ గాయకుడు పి. జయచంద్రన్ తుదిశ్వాస విడిచారు.
మలయాళ ప్రముఖ గాయకుడు పి. జయచంద్రన్ కన్నుమూశారు. త్రిశూర్ అమల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆరు దశాబ్దాలకు పైగా మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 16 వేలకు పైగా పాటలు పాడారు. ఉత్తమ గాయకుడిగా జాతీయ పురస్కారం పొందిన జయచంద్రన్‌కు కేరళ , తమిళనాడు నుంచి కలైమామణి అవార్డుతో పాటు నాలుగు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు లభించాయి. 1965లో 'కుంజాలి మరక్కర్' చిత్రంలో పి. భాస్కర్ రాసిన 'ఒరు ముల్లాపూ మాలయుమాయ్' అనే పాటను చిదంబరనాథ్ సంగీత దర్శకత్వంలో పాడారు. ఈ సినిమా విడుదలకు ముందు, మద్రాసులో జరిగిన ఒక సంగీత కార్యక్రమంలో జయచంద్రన్ పాడిన రెండు పాటలు విన్న దర్శకుడు ఎ. విన్సెంట్ సిఫారసు మేరకు, సంగీత దర్శకుడు జి. దేవరాజన్ 'కలితోజన్' చిత్రంలో పి. భాస్కర్ రాసిన 'మంజలయిల్ ముంగి తోర్తి' అనే పాటను పాడించారు.
1967లో విడుదలైన ఈ చిత్రంలోని పాటకు మంచి ఆదరణ లభించింది.తెలుగులో కూడా ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ను ఆలపించారు పి. జయచంద్రన్. ఇళయరా, రెహామాన్, కీరవాణి, కోటీ సంగీత సారధ్యంలో హిట్ సాంగ్స్ పాడారు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే... వెంకటేష్ సూర్య వంశం సినిమాలో రోజావే చిన్ని రోజావే పాటతో పాటు.. తరుణ్ హీరోగా మొదటి చిత్రం అయిన నువ్వే కావాలి లో అనగనగా ఆకాశం ఉంది పాట అద్భుతంగా ఆలపించారు జయచంద్రన్.