కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్
ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్
కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో తనపై ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ను కొట్టేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ కె. లక్ష్మణ్ ఇటీవల తీర్పును రిజర్వ్ చేశారు. మంగళవారం ఉదయం కేటీఆర్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నట్టుగా జడ్జిమెంట్ వెలువరించారు. క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేయడంతో ఈనెల 9న కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. సోమవారమే కేటీఆర్ విచారణకు హాజరయ్యేందుకు వెళ్లినా తన లాయర్ ను అనుమతించకపోవడంతో రాతపూర్వకంగా వివరణ ఇచ్చి వెనుదిరిగారు. దీంతో ఏసీబీ అధికారులు మళ్లీ నోటీసులు ఇచ్చారు. కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దన్న మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పు అనంతరం ఏసీబీ ఎలా ముందుకు వెళ్తుందో చూడాల్సి ఉంది. కేటీఆర్ మంగళవారం ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా, క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చే వరకు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తిని ఈడీ అంగీకరించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈడీ మళ్లీ నోటీసులు జారీ చేసే అవకాశముంది. హైకోర్టు తీర్పు తర్వాత నందినగర్ లోని నివాసంలో మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత సహా పార్టీ ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. లీగల్ టీమ్ తో సంప్రదించిన తర్వాత ఎలా ముందుకెళ్లాలో నిర్ణయించనున్నారు.