ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్
బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు
ఫార్మలా-ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరయ్యారు. అంతకుముందు గచ్చిబౌలిలోని నివాసం నుంచి ఆయన బయలుదేరారు. నేరుగా ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు చేపట్టారు. సుమారు 200 మంది పోలీసులు అక్కడ మోహరించారు.బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయం వద్ద ముగ్గురు ఏసీపీలు, 8మంది ఇన్‌స్పెక్టర్లు విధుల్లో ఉన్నారు.బాష్పవాయువు, వాటర్‌కెనాన్ల వాహనాలను పోలీసులు తెప్పించారు.
మరోవైపు ఈడీ కార్యాలయానికి పెద్దసంఖ్యలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకున్నది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిషాంక్ మీడియాతో మాట్లాడుతుండగా.. పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఆయనకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
వాస్తవానికి ఈ నెల 7న ఆయన హాజరుకావాల్సి ఉన్నా తాను రాలేనని కేటీఆర్ చెప్పడంతో 16న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు మరోసారి నోటీసులిచ్చారు. ఫార్ములా-ఈ రేస్‌లో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా.. ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఈ కేసులో మున్సిపల్ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్‌రెడ్డిలను ఈడీ విచారించింది.