మైనర్ విద్యార్థినిపై అత్యాచారం.. ట్యూషన్ టీచర్‌కు 111 ఏళ్ల శిక్ష
ఓ అత్యాచార కేసులో కీలక తీర్పు వెలువరించిన కేరళలోని ఫాస్ట్-ట్రాక్ కోర్టు
ఓ అత్యాచార కేసులో కేరళలోని ఫాస్ట్-ట్రాక్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మైనర్‌పై లైంగికదాడికి పాల్పడిన ట్యూషన్ టీచర్‌కు 111 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అంతేగాకుండా రూ. 1.05 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
కేరళకు చెందిన మనోజ్ గవర్నమెంట్ ఎంప్లాయి. ఇంటి వద్ద టూషన్ చెబుతుండేవాడు. తన వద్దకు ట్యూషన్‌కు వచ్చే ఇంటర్ విద్యార్థినిపై ఓ రోజు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫొటోలు తీయడంతో పాటు ఇతరులకు పంపించాడు. ఆ ఘటనతో భయపడిపోయి అమ్మాయి ట్యూషన్‌కు వెళ్లడం మానేసింది. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
2019లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. ఫోన్ స్వాధీనం చేసుకొన్నారు. ఫొరెన్సిక్ పరీక్షలో ఫొటోలు తీసినట్లు నిర్ధారణ అయ్యింది. ఘటన జరిగిన రోజు తాను ఆఫీసులోనే ఉన్నానంటూ బుకాయించాడు. కానీ, కాల్ రికార్డుల, ఫోన్ లొకేషన్ ఆధారంగా ఘటన జరిగిన రోజు అతను ఇంటి సమీపంలోనే ఉన్నట్లు తేలింది. ఈ కేసుపై విచారణ జరిపిన స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడికి 111 ఏళ్ల కఠిన శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.