పెళ్లయిన రెండు వారాలకే నవ వధువు, ఆమె తల్లి హత్య
కోడలు, ఆమె తల్లిదండ్రులు తన కుమారుడి పరువు తీయడం వల్లే ఇలా జరిగిందని వారిపై పగ పెంచుకున్న ప్రసాద్.. వారి చంపాలని నిర్ణయించుకున్నాడు.
పెళ్లయిన రెండు వారాలకే నవ వధువును, ఆమె తల్లిని భర్త, మామ కత్తితో పొడిచి హత్యచేశారు. వియ్యంకుడిపైనా కత్తితో దాడిచేయగా, గాయాలతో అతను ఆస్పత్రి పాలయ్యాడు. వారిని ఇంటికి తీసుకొచ్చి మరీ ఈ ఘాతుకానికి పాల్పడటం గమనార్హం. కర్నూలులో మంగళవారం జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటన అనంతరం భర్త కుటుంబ సభ్యులు పరారయ్యారు.
కర్నూలు చింతలమునినగర్‌కు చెందిన ప్రసాద్, కృష్ణవేణి దంపతులకు శ్రావణ్ ఏకైక సంతానం. బీటెక్ చదివిన అతను ఇటీవల బ్యాంకు ఉద్యోగం రావడంతో హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు. అతని తండ్రి ప్రసాద్ ఇడ్లీలు అమ్మేవాడు. తెలంగాణలోని వనపర్తికి చెందిన వెంకటేశ్వర్లు, రమాదేవి దంపతుల కుమార్తె రుక్మిణితో ఈ ఏడాది మార్చి ఒకటిన శ్రావణ్‌కు వివాహమైంది.
శ్రావణ్ పెళ్లిని ఇరుగుపొరుగువారికి కూడా చెప్పకుండా చేయడం గమనార్హం. వివాహానికి ఇరు కుటుంబాలకు చెందిన కొద్దిమందే హాజరయ్యారు. అనంతరం రుక్మిణి అత్తవారింటికి రాగా.. తనకు ఆఫీసులో పని ఉందంటూ ఆమెను పుట్టింట్లో వదిలేసిన శ్రావణ్ హైదరాబాద్ వెళ్లిపోయాడు. అప్పటినుంచి అతను భార్యను అనుమానిస్తూ వేధించేవాడు.
వెంకటేశ్వర్లు దంపతులు తమ కుమార్తెతో మాట్లాడగా, శ్రావణ్ మొదటిరోజు నుంచీ తనకు దూరంగా ఉన్నాడని ఆమె తెలిపింది. దీంతో వారు వియ్యంకుడితో గొడవ పడుతూ తమ కుమార్తెకు న్యాయం జరిగిందని బాధపడేవారు. తనకు ఇన్‌ఫెక్షన్ అయిందని శ్రావణ్ చెప్పడంతో.. అత్తమామలే అతనికి హైదరాబాదులో శస్త్రచికిత్స చేయించారు. ఈ క్రమంలో ఈ నెల పదో తేదీన శ్రావణ్ ఆత్మహత్యకు యత్నించాడు.
కోడలు, ఆమె తల్లిదండ్రులు తన కుమారుడి పరువు తీయడం వల్లే ఇలా జరిగిందని వారిపై పగ పెంచుకున్న ప్రసాద్.. వారి చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని కుమారుడితోనూ చర్చించగా, ఇద్దరూ కలిసి వారిని చంపేందుకు ప్లాన్ చేశారు.
మంగళవారం నాడు వనపర్తి నుంచి అత్తమామలను, భార్యను కర్నూలుకు తీసుకొచ్చిన శ్రావణ్.. వారిని ఇంటి మొదటి అంతస్తులోకి తీసుకెళ్లాడు. అతని వెంటే వచ్చిన ప్రసాద్ వియ్యంకురాలు రమాదేవిని, శ్రావణ్ భార్య రుక్మిణిని కత్తితో పొడిచి హత్య చేశారు. వెంకటేశ్వర్లు పైనా దాడి చేయగా, గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. పరారైన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.