కుమార్తెకు ఉరివేసి.. కొడుకుకు విషమిచ్చి దంపతుల ఆత్మహత్య
హబ్సిగూడలో దారుణం.. ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసుల అనుమానం;
హైదరాబాద్ హబ్సిగూడలో దారుణం చోటు చేసుకున్నది. కుమారుడు, కుమార్తెను చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కల్వకుర్తికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం ఏడాది కింద హబ్సిగూడకు వచ్చింది. ఆయన కొంతకాలం ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసి మానేశారు. ఆరు నెలలుగా ఉద్యోగానికి దూరమడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలోనే కుమారుడు విశ్వాన్ రెడ్డికి విషమిచ్చి, కుమార్తె శ్రీతరెడ్డికి ఉరేసి చంపినట్టు ఆనవాళ్ల ఆధారంగా పోలీసులు అంచనాకు వచ్చారు. అనంతరం భార్య కవితతో కలిసి చంద్రశేఖర్ రెడ్డి ఉరేసుకొని బలవన్మరణం చెందినట్టు భావిస్తున్నారు. ఓయూ పోలీసులు అనుమానాస్పద మరణాలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. 'నా చావుకు ఎవరూ కారణం కాదు.. వేరే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నందుకు క్షమించండి. కెరీర్‌లోనూ, శారీరకంగా, మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్నా. షుగర్, నరాలు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నాను' అని సూసైడ్ నోట్‌లో చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.