అరెస్ట్ చేస్తే జైళ్లో సినిమా కథలు రాసుకుంటా
రాంగోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఏపీ పోలీసులు తనను అరెస్టు చేస్తే జైలుకెళ్తానని.. అక్కడి ఖైదీలతో స్నేహం చేసి జైళ్లోనే నాలుగు సినిమాలకు కథలు రాసుకుంటానని దర్శకుడు రాంగోపాల్ వర్మ కామెంట్ చేశారు. సోమవారం తనపై ఏపీలో నమోదైన కేసులు.. అరెస్టు నుంచి తాను తప్పించుకుని తిరుగుతున్నాననే ప్రచారంపై వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించడం తప్ప ఇంకా ఏమీ లేదన్నారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని, లైవ్‌లో మీడియా చానెళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నానని తెలిపారు. సోషల్ మీడియాను రెగ్యులరైజ్ చేయడం చాలా కష్టమని, చట్ట ప్రకారం తనకున్న అవకాశాలను బట్టి ఏపీ పోలీసులకు సమాధానం ఇచ్చానని తెలిపారు. కొన్నేళ్లుగా తన ఎక్స్ ఎకౌంట్‌లో వేల పోస్టులు పెట్టానని.. వాటి వల్ల నలుగురి మనోభావాలు దెబ్బతిన్నాయని ఏడాది తర్వాత కేసులు పెట్టారని తెలిపారు.
తనకు ఇప్పటికే ఉన్న కమిట్‌మెంట్స్ వల్లనే పోలీసుల విచారణకు హాజరు కాలేదని తెలిపారు. వర్మ డెన్‌కు పోలీసులు వస్తే మీడియా చానెళ్లు అక్కడికి వచ్చి అతి చేశానని, తాను పారిపోయానని, మంచం కింద దాక్కున్నానని కథనాలు ప్రసారం చేశాయన్నారు. కేరళ, కోయంబత్తూరులోనూ తన కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారని కూడా కథనాలు ప్రసారం చేశారని తెలిపారు. తన అరెస్టు గురించి పోలీసులు ఎక్కడైనా అధికారికంగా స్పందించారా అని ప్రశ్నించారు. సోషల్ మీడియలో అతిగా ప్రచారం చేయొద్దని కొందరు సలహాలు ఇస్తున్నారని.. ఒక కార్టూన్‌ను అనేక కోణాలు ఆపాదించే అవకాశాలున్నాయని గుర్తు చేశారు. తనను అసభ్య పదజాలంతో తిడుతూ మీమ్స్ పెడుతున్నారని.. మీమ్స్‌ను అమెరికానే నియంత్రించలేకపోయిందని.. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది ఇంకా పెరిగిపోయిందన్నారు. ప్రతి మనిషికి వేర్వేరు ఆలోచనలు ఉంటాయని.. అవి అందరికీ వర్తిస్తాయని తేల్చిచెప్పారు.