వేధించాడు.. చంపేశారు..! - నగ్న వీడియోలతో యువతికి వేధింపులపై ఆగ్రహం
శివమాల వేసుకుని ఉన్న మురళీకృష్ణను.. తన స్నేహితుడితో కలసి జనవరి 25న బైక్‌పై తీసుకెళ్లిన దినేశ్ నగర శివారులోని పంచలింగాల ప్రాంతంలో కత్తితో పొడిచి హతమార్చాడు.
స్నేహితుడి సెల్ఫోన్లో ఉన్న అతని ప్రియురాలి నగ్న వీడియోలను అతనికి తెలియకుండా తన ఫోన్లోకి పంపించుకున్న ఓ యువకుడు.. ఆపై ఆమెను ఆ వీడియోలతో వేధింపులకు గురిచేశాడు. ఈ వ్యవహారం చివరికి అతని ప్రాణాలనే తీసింది. జనవరిలో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మృతుడు మల్లెపోగు మురళీకృష్ణ (22) ఫ్లవర్ డెకరేటర్. కర్నూలు మండలం బాలాజీనగర్‌కు చెందిన డిగ్రీ చదువుతున్న ఎరుకలి దినేశ్ అతని స్నేహితుడు.
దినేశ్ ఫోన్లో అతని ప్రియురాలి నగ్న వీడియోలు ఉన్నట్టు గుర్తించిన మురళీకృష్ణ.. వాటిని అతనికి తెలియకుండా తన ఫోన్లోకి పంపించుకున్నాడు. ఆపై సదరు యువతికి ఫోన్ చేసి ఆ వీడియోల ద్వారా ఆమెను వేధించడం ప్రారంభించాడు. ఆ వీడియోలను కుటుంబసభ్యులు, బంధువులకు పంపుతానని బెదిరించేవాడు. అతని వేధింపులు తాళలేక సదరు యువతి ఇటీవల ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రి పాలైంది. మురళీకృష్ణ వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్యకు యత్నించిందని తెలుసుకున్న దినేశ్ అతనిపై కక్ష పెంచుకున్నాడు. అతన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు.
శివమాల వేసుకుని ఉన్న మురళీకృష్ణను.. తన స్నేహితుడితో కలసి జనవరి 25న బైక్‌పై తీసుకెళ్లిన దినేశ్ నగర శివారులోని పంచలింగాల ప్రాంతంలో కత్తితో పొడిచి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని ఓ ఆటోలో నన్నూరు టోల్‌ప్లాజా సమీపంలో గల హెచ్ఎన్ఎస్ఎస్ కాలువలో పడేశాడు. మృతుడి సెల్‌ఫోన్, దుస్తులను వేర్వేరు చోట్ల పడేసి అక్కడినుంచి వెళ్లిపోయాడు.
మురళీకృష్ణ ఆచూకీ కనిపించకపోవడంతో అతని కోసం కుటుంబసభ్యులు తెలిసినవారందరినీ ఆరా తీసినా, అనేక ప్రాంతాల్లో గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది. దీంతో ఫిబ్రవరి 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అతని స్నేహితుడు దినేశ్‌పై అనుమానం ఏర్పడింది. అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, నేరాన్ని అంగీకరించాడు. ఇప్పుడు పోలీసులు మురళీకృష్ణ మృతదేహం కోసం కాలువలో గాలింపు చేపట్టారు.