సామూహిక అత్యాచార వీడియోలు వైరల్
దీనికి కారణమైన ఎనిమిదిమంది నిందితుల అరెస్ట్..అసోం రాష్ట్రంలోని గుహవాటీ లోని ఓ ఆలయ పరిసరాల్లో జరిగిన ఘటన
దేశంలో వరుస అత్యాచార, లైంగిక వేధింపుల ఘటనలు ఆందోళనకరంగా మారుతున్నాయి. తాజాగా అసోం లో ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. గత నెల జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనికి కారణమైన ఎనిమిదిమంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అసోం రాష్ట్రంలోని గుహవాటీ లోని ఓ ఆలయ పరిసరాల్లో నవంబర్ 17న ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆ దృశ్యాలను సెల్ ఫోన్ లో రికార్డు చేసిన నిందితులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవికాస్తా వైరల్ గా మారి పోలీసుల దృష్టికి వెళ్లడంతో అత్యాచారానికి పాల్పడిన 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.అయితే బాధితురాలు ఎవరు అనే విషయం తెలియాల్సి ఉన్నది. నిందితుల వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన సమయంలో నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ సందర్భంగా ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.