వర్క్ ఫ్రం హోం పేరిట మోసం.. - ఇద్దరు నిందితుల పట్టివేత
ఉద్యోగం కావాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. అందుకు గాను కొంతమొత్తం కట్టాలని చెప్పి వసూలు చేశారు. ఆ తర్వాత ఈసీఎస్ చార్జీ, జీఎస్టీ, కొరియర్ చార్జీ, ఇన్సూరెన్స్ అంటూ పలు రూపాల్లో దఫదఫాలుగా ఆమె నుంచి లక్షా 27 వేల రూపాయలు వసూలు చేశారు.
కోవిడ్ అనంతరం వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ బాగా పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు అమాయకులను వలలో వేసుకొని.. అడ్డంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇదే తరహా మోసం తాజాగా వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఫరీదాబాద్‌కు చెందిన ఓ మహిళ ఫేస్ బుక్‌లో కొన్ని రోజుల క్రితం ఓ ఉద్యోగ ప్రకటన చూసింది. వర్క్ ఫ్రం హోం అవకాశం ఉండటంతో ఇంటి వద్దే ఉండి పనిచేసుకుంటూ డబ్బు సంపాదించుకోవచ్చని ఆశ పడింది. అనుకున్నదే తడవుగా అందులో ఇచ్చిన వాట్సాప్ నంబరుకు కాల్ చేసింది. దీంతో మోసగాళ్లు ఆమెకు మాయమాటలు చెప్పి మరిన్ని ఆశలు కల్పించారు.
ఉద్యోగం కావాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. అందుకు గాను కొంతమొత్తం కట్టాలని చెప్పి వసూలు చేశారు. ఆ తర్వాత ఈసీఎస్ చార్జీ, జీఎస్టీ, కొరియర్ చార్జీ, ఇన్సూరెన్స్ అంటూ పలు రూపాల్లో దఫదఫాలుగా ఆమె నుంచి లక్షా 27 వేల రూపాయలు వసూలు చేశారు. ఆ తర్వాత ఆమె ఉద్యోగం విషయమై ప్రశ్నిస్తే వారి నుంచి ఎలాంటి స్పందనా లేదు.
దీంతో తాను మోసపోయానని గుర్తించిన సదరు బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కాల్ ఢిల్లీలోని రోహిణి సెంటర్‌లో గల కాల్ సెంటర్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. ఆ కాల్ సెంటర్ హరియాణా పోలీసులు ఆకస్మిక దాడి చేసి బీహార్‌కు చెందిన ప్రధాన నిందితుడు ప్రభాత్, ఓం ప్రకాశ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 14 మొబైల్ ఫోన్లు, 13 సిమ్ కార్డులు, రూ.64 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు చెప్పారు.