పేదింట పెను విషాదం – మట్టి ఇంటి పైకప్పు కూలి నలుగురు మృతి
పేదింట పెను విషాదం చోటుచేసుకుంది. మట్టి ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పేదింట పెను విషాదం చోటుచేసుకుంది. మట్టి ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఊహించని విధంగా జరిగిన ఈ ఘటన ఆ కుటుంబాన్ని కన్నీటి సంద్రంలో ముంచేసింది. నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ మండలం వనపట్ల గ్రామంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
వనపట్ల గ్రామానికి చెందిన గొడుగు భాస్కర్ ఆటో డ్రైవర్. అతనికి భార్య పద్మ (26), కుమార్తెలు తేజస్విని (7), వసంత (5), కుమారుడు రిత్విక్ (10 నెలలు) ఉన్నారు. భాస్కర్ తల్లిదండ్రులు బాలస్వామి, చిట్టెమ్మ కూడా వారితోనే ఉంటున్నారు. వీరు రెండు గదుల మట్టి ఇంట్లో నివాసం ఉంటుండగా, దానికి రేకుల వరండా ఉంది. ఆదివారం రాత్రి భోజనాలయ్యాక అందరూ నిద్రకు ఉపక్రమించారు. ఇంటి ముందు భాగంలో ఉన్న రేకుల వరండాలో భాస్కర్ తల్లిదండ్రులు.. మట్టి కప్పు ఉన్న గదిలో భాస్కర్, పద్మ, ముగ్గురు పిల్లలు నిద్రపోయారు.
రాత్రి వేళ గంటపాటు వర్షం కురవడంతో ఇంటి గోడలు, పైకప్పు తడిశాయి. అప్పటికే ఇంటి దూలం చెదలు పట్టి ఉండటంతో తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో మట్టి పైకప్పు అమాంతం కూలిపోయి కింద పడుకున్న భాస్కర్ దంపతులు, పిల్లలపై పడింది. ఈ ఘటనతో మేలుకున్న భాస్కర్ తల్లిదండ్రులు కేకలు వేయటంతో చుట్టుపక్కలవారు వచ్చి.. మట్టిని తొలగించి భాస్కర్‌ను కాపాడారు. మిగిలినవారిని కూడా కాపాడేందుకు మట్టి తొలగించేలోపే వారంతా ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలపాలైన భాస్కర్‌ను చికిత్స నిమిత్తం నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు.
ముందే గుర్తించినప్పటికీ...
తాము నివాసం ఉంటున్న మట్టి ఇంటి దూలానికి చెదలు పట్టిన విషయాన్ని కుటుంబసభ్యులు ముందుగానే గుర్తించారు. మూడు రోజుల క్రితమే దానికి గుర్తించిన కుటుంబసభ్యులు దానికి సపోర్టుగా పెట్టేందుకు కర్రలను తెచ్చి ఉంచారు. వాటిని ఇంకా అమర్చలేదు. మరోపక్క తాము ఉంటున్న మట్టి ఇంటిని కూల్చేసి రెండు రేకుల గదులు వేసుకుంటామని భాస్కర్ ఇటీవలే తన స్నేహితులతో చెప్పినట్టు సమాచారం. ఇంతలోనే ఈ ఘోరం జరగడంతో గ్రామస్తులు కన్నీటిపర్యంతమవుతున్నారు.