హంపిలో గ్యాంగ్ రేప్, ఇద్దరు నిందితుల అరెస్ట్
ఇజ్రాయెల్ పర్యాటకురాలు సహా మరో యువతిపై సామూహిక అత్యాచారం;
ఇజ్రాయెల్ పర్యాటకురాలు సహా మరో యువతిపై సామూహిక అత్యాచారం చేసి వారితో ఉన్న ఒడిషా పర్యాటకుడిని హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.అరెస్టయిన ఇద్దరు నిందితులను గంగావతి నగర నివాసితులు సాయి మల్లు, చేతన్ సాయిగా గుర్తించారు. పరారీలో ఉన్న మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు కర్నాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు.
అత్యాచార ఘటనను ఖండించిన సిద్ధరామయ్య నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితులకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇజ్రాయెల్‌కు చెందిన 27 ఏళ్ల యువతితో పాటు ఆమెతో ఉన్న హోమ్ స్టే యజమానిపై హంపీ సమీపంలో ముగ్గురు సామూహిక అత్యాచారానికి తెగబడినారు. రాత్రివేళ స్టార్ గేజింగ్ చేద్దామని యువతులతో పాటు అమెరికా, మహారాష్ట్ర, ఒడిషాకు చెందిన ముగ్గురు యువకులు సనాపూర్ సరస్సు వద్దకు వెళ్లారు. యువకులను సరస్సులోకి నెట్టేసిన దుండగులు ఆ ఇద్దరు యువతులపై గ్యాంగ్ రేప్‌నకు పాల్పడ్డారు. నీటిలో పడ్డ ఒడిషాకు చెందిన బిబాష్ చనిపోయాడు.