కన్నబిడ్డలపై పెట్రోల్ పోసి.. కన్నతండ్రి పైశాచికం
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డలను కన్నతండ్రే పెట్రోల్ పోసి నిప్పంటించి.. హతమార్చాలని చూశాడు.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డలను కన్నతండ్రే పెట్రోల్ పోసి నిప్పంటించి.. హతమార్చాలని చూశాడు. స్థానికులు వెంటనే స్పందించడంతో పిల్లలిద్దరూ తీవ్ర గాయాలతో కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. భార్యపై కోపంతోనే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనలో తండ్రికి కూడా గాయాలయ్యాయి. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌లోని శాటిలైట్ సిటీ గ్రామంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
గ్రామంలోని వాంబే కాలనీకి చెందిన బూడి సాయికిరణ్ (40)కు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామానికి చెందిన దుర్గతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమారుడు, కుమార్తె సంతానం. ఏడాదిన్నర క్రితం వరకు బాగానే ఉన్న ఆ దంపతుల మధ్య ఆ తర్వాత విభేదాలు మొదలయ్యాయి. రెండోసారి గర్భం దాల్చిన దుర్గ ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లి.. భర్తతో గొడవల నేపథ్యంలో పిల్లలతో పాటు అక్కడే ఉండిపోయింది.
ఇంటికి తీసుకెళ్లాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా దుర్గ అంగీకరించకపోవడంతో గత నెల 21న యర్రవరంలోని అత్తారింటికి వెళ్లిన కిరణ్.. వారితో గొడవ పడ్డాడు. అదే క్రమంలో పిల్లలు శివదుర్గ సందీప్ (4), ఏడాదిన్నర కుమార్తెను బలవంతంగా తన ఇంటికి తీసుకొచ్చేశాడు. ఆ తర్వాత కూడా భార్య ఇంటికి రాకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కిరణ్ భార్యపై కోపంతో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తన పిల్లలిద్దరినీ హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. శనివారం అర్ధరాత్రి పిల్లలిద్దరూ నిద్రిస్తున్న సమయంలో వారిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు.
ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో చిన్నారులిద్దరూ ఆ బాధ తాళలేక గావుకేకలు పెట్టారు. చుట్టుపక్కల వారు వెంటనే వచ్చి చూడగా, పిల్లలిద్దరూ మంటల్లో తగలబడిపోతుండటం చూసి వెంటనే మంటలు ఆర్పేశారు. కిరణ్ కూడా ఒంటిపై మంటలు అంటుకుని ఉండగా, వాటినీ ఆర్పేశారు. వారిని వెంటనే కాకినాడ జీజీహెచ్‌కి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు ఆదివారం విచారణ చేపట్టగా, భార్యపై కోపంతోనే కిరణ్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని తేలింది. దుర్గ వాంగ్మూలం ఆధారంగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ఎండీ ఉమర్ తెలిపారు.