కోర్టుల లైవ్‌ స్ట్రీమింగ్‌ మీడియాలో ప్రసారం చేయొద్దు

ఇప్పటికే ప్రసారం చేసిన వీడియోలు తొలగించాలే : హైకోర్టు ఆదేశాలు

Advertisement
Update:2024-11-08 19:39 IST

హైకోర్టుతో పాటు ఇతర న్యాయస్థానాల్లో జరిగే లైవ్‌ స్ట్రీమింగ్‌ ను మీడియా, సోషల్‌ మీడియాలో ప్రసారం చేయవద్దని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈమేరకు హైకోర్టు రిజిస్ట్రార్‌ శుక్రవారం ఆదేశాలు ఇచ్చారు. న్యాయస్థానాల్లో జరిగే విచారణ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయడం, రికార్డింగ్‌ చేసి న్యూస్‌ గా టెలికాస్ట్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల కోర్టుల లైవ్‌ స్ట్రీమింగ్‌ ను పలు మీడియా సంస్థలతో పాటు సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ లు ప్రసారం చేశాయి. ఆ ప్రసారాలను వెంటనే తొలగించాలని, లేకుంటే చర్యలు తప్పవని హైకోర్టు రిజిస్ట్రార్‌ తేల్చిచెప్పారు. సుప్రీం కోర్టు సహా దేశంలోని న్యాయస్థానాల్లో చేపట్టే విచారణ పారదర్శకంగా ఉండేందుకు లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయాలని చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా డీవై చంద్రచూడ్‌ ఆదేశాలు ఇచ్చారు. ఈక్రమంలో సుప్రీం కోర్టుతో పాటు అన్ని రాష్ట్రాల హైకోర్టులు, ఇతర న్యాయస్థానాల్లో జరుగుతోన్న విచారణను 'లైవ్‌ లా' పేరుతో లైవ్‌ స్ట్రీమింగ్‌ లో అందుబాటులోకి తెచ్చారు. అలా ఇచ్చే లైవ్‌ స్ట్రీమింగ్‌ ను ఏ మీడియా సంస్థ కూడా ప్రసారం చేయరాదని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో పాటు గతంలో ప్రసారం చేసిన వీడియోలన్నీ తొలగించాలని స్పష్టం చేసింది. హైడ్రా పై నమోదైన కేసుల విచారణను అనేక మీడియా సంస్థలు, సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ లు ప్రసారం చేశాయి. అవి ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి ఇబ్బంది కలిగించేవిగా ఉన్నాయి. ఇదే విషయాన్ని పలువురు న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్లడంతోనే లైవ్‌ స్ట్రీమింగ్‌ ను టెలికాస్ట్‌ చేయొద్దని ఆదేశాలు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.

Tags:    
Advertisement

Similar News