తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు
క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు.. వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్
ఫార్ములా - ఈ కేసులో క్వాష్ పిటిషన్ పై తాము తీర్పు వెలువరించే వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దని తెలంగాణ హైకోర్టు తేల్చిచెప్పింది. ఫార్ములా -ఈ కేసులో ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ను కొట్టేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్‌పై జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఎదుట సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. పిటిషనర్ కేటీఆర్ తరపున సుప్రీం కోర్టు సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ్ దవే, ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ లక్ష్మణ్ తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తాము తీర్పు వెలువరించే వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దని ఆదేశించారు. ఫార్ములా -ఈ రేసుపై ఒప్పందం చేసుకోవడంలో తప్పులేదని, ప్రభుత్వం చెప్తోన్నట్టుగా రూ.55 కోట్లు ఎఫ్‌ఈవోకు చెల్లించారే తప్ప ఇందులో కేటీఆర్‌కు ఎలాంటి లబ్ధి చేకూరలేదని దవే వాదించారు. అవినీతే జరగనప్పుడు ఐపీసీ సెక్షన్ 409 వర్తించదని తెలిపారు. బీఎన్‌ఎస్ వచ్చాక ఐపీసీ సెక్షన్ల కింద కేసు ఎందుకు పెట్టారని జస్టిస్ లక్ష్మణ్ ప్రశ్నించగా, 14 నెలల కిందటి కేసు కాబట్టి ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని దవే వివరించారు.
ఎఫ్‌ఈవోతో చేసుకున్న అగ్రిమెంట్ లో ఎలాంటి లాభాలు వస్తాయో చెప్పలేదని, మూడు దఫాలుగా ఆ సంస్థకు డబ్బులు బదిలీ చేశారని ఏజీ వాదించారు. రూ.55 కోట్లను ఎలాంటి అనుమతులు లేకుండానే ఎఫ్‌ఈవోకు బదిలీ చేశారని తెలిపారు. ఏసీబీ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, ఎంత మంది స్టేట్ మెంట్ రికార్డు చేసిందని హైకోర్టు ప్రశ్నించగా ఫిర్యాదుదారుడు, ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానాకిషోర్ స్టేట్‌మెంట్ ఏసీబీ నమోదు చేసిందని ఏజీ తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు సేకరించారని హైకోర్టు ప్రశ్నించగా, దర్యాప్తు కొనసాగుతుందని విచారణలో అన్ని ఆధారాలు బయట పడుతాయని ఏజీ తెలిపారు. డబ్బుల చెల్లింపులో ఎలాంటి విధివిధానాలు ఫాలో కాలేదో చెప్పాలని న్యాయస్థానం ప్రశ్నించగా.. ఆర్థిక శాఖ, కేబినెట్ ఆమోదం లేకుండానే ఎఫ్‌ఈవోకు రూ.55 కోట్లు బదిలీ చేశారని, ఇలా నగదు బదిలీ చేయడంతో హెచ్‌ఎండీఏపై రూ.8 కోట్ల అదనపు భారం పడిందన్నారు. గవర్నర్ అనుమతి తీసుకుని కేసు నమోదు చేశామని ఏజీ తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ తీర్పును రిజర్వ్ చేస్తున్నామని ప్రకటించారు. కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని ఇప్పటికే మధ్యంతర ఆదేశాలు ఉన్నాయని.. తాము తీర్పు వెలువరించే వరకు అవే ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.