డెక్కన్ క్రానికల్ వెంకట్రామిరెడ్డి అరెస్టు.. మనీ లాండరింగ్ కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ

కెనరా, ఐడీబీఐ బ్యాంకులను మోసం చేసిన కేసులో ఈడీ డీసీ ప్రమోటర్లపై కేసులు నమోదు చేసింది. దాదాపు రూ.9 వేల కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసు వెంకట్రామిరెడ్డిపై ఉన్నది.

Advertisement
Update:2023-06-14 10:15 IST

డెక్కన్ క్రానికల్ వెంకట్రామిరెడ్డి అరెస్టు

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) ప్రమోటర్లకు షాక్ ఇచ్చారు. మనీ లాండరింగ్ కేసులో విచారణకు సహకరించడం లేదనే కారణంతో వెంకట్రామిరెడ్డి, పీకే అయ్యర్, మణి ఓమెన్‌లను బుధవారం ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ముగ్గురిని కూడా ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం తీసుకొని వెళ్లారు. అనంతరం కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.

కెనరా, ఐడీబీఐ బ్యాంకులను మోసం చేసిన కేసులో ఈడీ.. డీసీ ప్రమోటర్లపై కేసులు నమోదు చేసింది. దాదాపు రూ.9 వేల కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసు వెంకట్రామిరెడ్డిపై ఉన్నది. డీసీ పేరుతో పెద్ద మొత్తంలో రుణాలు తీసుకొని.. వాటిని దారి మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. రుణాల ఎగవేతపై గతంలోనే సీబీఐ కేసు నమోదు చేసింది. కాగా, తీసుకున్న రుణాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నారని సీబీఐ ఆరోపణలు నమోదు చేసింది. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ కేసు ఫైల్ చేసింది. గతంలోనే వెంకట్రామిరెడ్డికి చెందిన రూ.3,300 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

2009-11 మధ్య పలు బ్యాంకుల్లో రూ.8,800 వరకు రుణాలు తీసుకొని చెల్లించకుండా ఎగవేశారు. తమను మోసగించారంటే కెనరా బ్యాంక్ సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఒకే ఆస్తిని వేర్వేరు బ్యాంకుల్లో తనఖా పెట్టినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నది. అప్పట్లో రుణాల ఎగవేత కేసులో సీబీఐ కూడా అరెస్టు చేసింది. తాజాగా ఈడీ వెంకట్రామిరెడ్డి సహా ఇద్దరు ప్రమోటర్లను అదుపులోకి తీసుకున్నది. పలుమార్లు విచారణకు పిలిచినా.. రాకపోవడంతోనే అరెస్టు చేశారు.

Tags:    
Advertisement

Similar News