పోలీసులను ఇసుక ట్రాక్టర్లు తొక్కి చంపడం కొత్తేమీ కాదు.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
జాముయి జిల్లాలోని మహులియా తాండ్ గ్రామంలో ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుసుకున్న సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రభాత్ రంజన్ ఇద్దరు హోంగార్డులతో ఆ గ్రామానికి చేరుకున్నారు.
ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను తొక్కించుకుంటూ వెళ్లిన సంఘటన బిహార్ రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ ఘటనలో ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ మృతిచెందగా, హోంగార్డు పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ ఘటనపై స్పందించిన బిహార్ మంత్రి పోలీసులను ఇసుక ట్రాక్టర్లు తొక్కి చంపడం కొత్తేమీ కాదని వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది.
జాముయి జిల్లాలోని మహులియా తాండ్ గ్రామంలో ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుసుకున్న సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రభాత్ రంజన్ ఇద్దరు హోంగార్డులతో ఆ గ్రామానికి చేరుకున్నారు. ఓ ట్రాక్టర్‌లో ఇసుక తరలిస్తుండగా గుర్తించి ఆ వాహనాన్ని అడ్డుకునేందుకు ఎదురుగా నిలబడ్డారు. డ్రైవర్ ట్రాక్టర్‌ను ఆపకుండా పోలీసులను తొక్కించుకుంటూ ముందుకెళ్లిపోయాడు.
ఈ ఘటనలో సబ్ ఇన్‌స్పెక్టర్ రంజన్‌తో పాటు హోంగార్డు రాజేష్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఎస్ఐ ప్రభాత్ రంజన్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. హోంగార్డు రాజేష్ కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.
కాగా, ఈ ఘటనతో సంబంధం ఉన్న నిందితుడు మిథిలేష్ కుమార్‌ను అరెస్టు చేశామని, ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు జాముయి ఎస్పీ శౌర్య సుమన్ తెలిపారు. ఈ ఘటనపై జాముయి ఎంపీ చిరాగ్ పాశ్వాన్ స్పందిస్తూ.. ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివాదాస్పదమైన మంత్రి వ్యాఖ్యలు
పోలీసులను ట్రాక్టర్‌తో తొక్కించడంపై బిహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం సృష్టిస్తున్నాయి. పోలీసులను ఇసుక ట్రాక్టర్లు తొక్కి చంపడం కొత్తేమీ కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలు గతంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లో జరిగాయని చెప్పారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని తెలిపారు. కాగా, పోలీసులను ఇసుక ట్రాక్టర్‌తో తొక్కించడం కొత్తేమీ కాదని మంత్రి వ్యాఖ్యానించడంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.