పల్నాడు 'ఐసీఐసీఐ' బ్యాంకు అక్రమాలపై సీఐడీ విచారణ
ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్న బాధితులను మోసం చేసిన వ్యవహారంపై ఆరా తీస్తున్న సీఐడీ అధికారులు
పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట, నరసరావు పేట ఐసీఐసీఐ బ్యాంకు శాఖల్లో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణ చేపట్టింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్న బాధితులను మోసం చేసిన వ్యవహారంలో చిలకలూరిపేట బ్యాంకు సిబ్బందిని అధికారులు విచారిస్తున్నారు. ఖాతాదారుల ఎఫ్‌డీలు దారి మళ్లించడంలో ఉన్న పాత్ర, ఎంత మొత్తంలో నగదు దారి మళ్లించారనే విషయంపై కూపీ లాగుతున్నారు. మోసపోయిన ఖాతాదారులకు చిలకలూరి పేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భరోసా ఇచ్చారు. బాధితులకు న్యాయం చేయాలని బ్యాంకు అధికారులను ఎమ్మెల్యే కోరారు.
బాధితులు రెండు నెలలుగా ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ ఖాతాకు జమ కాకపోవడంతో ఇటీవల బ్యాంకుకు వెళ్లి నిలదీశారు. ఆ ఫిక్స్‌డ్ డిపాజిట్ల బాండ్లు చెల్లవని.. అందులో నగదు, బంగారం లేదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో షాక్‌కు గురయ్యారు. మోసపోయామని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఈ కేసును సీఐడీకి అప్పగించారు. చిలకలూరిపేటలోని ఐసీఐసీఐ బ్యాంక్ బ్రాంచ్‌లో రూ.30 కోట్ల ఆర్థిక అవకతవకలు జరిగిన కొద్ది రోజులకే నరసరావుపేటలోని ఐసీఐసీఐ బ్యాంక్ బ్రాంచ్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది. దీంతో బ్యాంకు డిపాజిట్లు, బంగారు ఆభరణాల భద్రతపై ఆందోళన నెలకొంది.