వికారాబాద్‌ జిల్లాలో అధికారులపై దాడి.. 55 మంది అరెస్ట్‌

దుద్యాల, కొండగల్‌, బోంరాస్‌పేట మండలాల్లో ఇంటర్నెట్‌ సర్వీసులు బంద్‌.. ఉద్యోగుల విధుల బహిష్కరణ

Advertisement
Update:2024-11-12 09:59 IST

ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు స్థల సేకరణ కోసం వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో నిన్న నిర్వహించ తలపెట్టిన గ్రామసభ రణరంగాన్ని తలపించింది. అధికారులపై గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పోలీసులు 55మంది అరెస్టు చేశారు. దుద్యాల, కొండగల్‌, బోంరాస్‌పేట మండలాల్లో ఇంటర్నెట్‌ సర్వీసులు నిలిపివేశారు. లగచర్లలో భారీగా పోలీసులు మోహరించారు.

సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏకంగా జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌, సబ్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌, కొడంగల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (కడా) ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిలపై ఆయా గ్రామాల రైతులు కర్రలు, రాళ్లతో దాడులకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కలెక్టర్, అడిషనల్‌ కలెక్టర్‌ తృటిలో తప్పించుకోగా కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను తప్పించడానికి యత్నించిన డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డిపైనా దాడి జరిగింది.

ఉద్యోగుల విధుల బహిష్కరణ

ఫార్మా పరిశ్రమలో భూసేకరణ చేపట్టాలని వెళ్లిన అధికారులపై దాడి ఘటనకు నిరసనగా.. రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసనకు దిగారు. వికారాబాద్‌ జిల్లాలో ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు.

Tags:    
Advertisement

Similar News