అకాలీదళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్నం
స్వర్ణ దేవాలయం వద్ద కాల్పులు జరిపిన దుండగుడు
అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం వద్ద అకాల్ తఖ్త్ విధించిన శిక్ష అనుభవిస్తున్న శిరోమణి అకాలీదళ్ నేత, పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్నం జరిగింది. దుండగుడు తుపాకీతో సమీపానికి వెళ్లగా.. వెంటనే బాదల్ అనుచరులు అప్రమత్తమై అతడిని అడ్డుకున్నారు. దీంతో తుపాకీ గాల్లో పేలింది. ఈ ఘటనలో సుఖ్‌బీర్‌కు ఎలాంటి హానీ జరగలేదు. భద్రతా సిబ్బంది నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడిని నారైన్ సింగ్ చౌరాగా గుర్తించారు. అతను గతంలో బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ అనే ఉగ్రముఠాలో పనిచేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు పేర్కొంటున్నాయి.
1984లో నరైన్ సింగ్ సరిహద్దులు దాటి పాకిస్థాన్ వెళ్లినట్లు సదరు కథనాలు వెల్లడించాయి. పంజాబ్‌లోకి అక్రమ ఆయుధాలు తేవడం, పేలడు పదార్థాల రవాణాలో అతను కీలకంగా వ్యవహరంచినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కొంతకాలనికి భారత్ తిరిగి వచ్చిన అతడిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. కొన్నినెలలు జైలు శిక్ష కూడా అను భవించినట్లు సమాచారం.
అకాల్ తఖ్త్ విధించిన శిక్షలో భాగంగా స్వర్ణదేవాలయ ప్రవేశద్వారా వద్ద సుఖ్‌బీర్ వీల్‌చైర్‌పై కూర్చొని సేవాదార్ (కాపలాదారుడు)గా ఉండగా.. ఓ వృద్ధుడు ఆయనను సమీపించాడు. కొన్ని అడుగుల దూరంలోనే ఉన్న అతను ప్యాంట్ జేబులోంచి తుపాకీ తీసి సుఖ్‌బీర్‌పై కాల్పులు జరిపాడు. గమనించిన సుఖ్‌బీర్ వ్యక్తిగత సిబ్బంది వెంటనే వృద్ధుడిని అడ్డుకొని పక్కకు తీసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది.