ఆర్జీవీకి ఏపీ పోలీసుల నోటీసులు
'వ్యూహం' సినిమా ప్రమోషన్ సమయంలో చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులతో పాటు పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచే విధంగా వర్మ ఎక్స్‌లో పోస్టులు పెట్టారంటూ కేసు నమోదు
వివాదాస్పద డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ కు ఏపీ పోలీసులు నోటీసులిచ్చారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు.. జూబ్లీహిల్స్‌లోని ఆర్జీవీ ఇంటికి వచ్చి అందజేశారు. ఎస్సై శివరామయ్య ఆధ్వర్యంలోని బృందం నోటీసులు ఇచ్చింది.
ఎన్నికలకు ముందు 'వ్యూహం' సినిమా ప్రమోషన్ సమయంలో నాటి విపక్ష నేత చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచే విధంగా వర్మ ఎక్స్‌లో పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్‌లో కేసు నమోదైంది. మద్దిపాడు మండల టీడీపీ కార్యదర్శి ఎం.రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం అర్ధరాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు అందజేశారు. మరోవైపు తుళ్లూరులోనూ ఆర్జీవీపై కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ ఫొటోలను వర్మ గతంలో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టు పెట్టారని రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు తుళ్లూరు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.