పుళల్ సెంట్రల్ జైలుకు నటి కస్తూరి
12 రోజుల రిమాండ్ విధించిన ఎగ్మోర్ మెట్రోపాలిటన్ న్యాయమూర్తి
తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి, బీజేపీ నాయకురాలు కస్తూరిని పుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ లో నటి కస్తూరిని అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు ఆదివారం ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. మెజిస్ట్రేట్ ఆమెకు 12 రోజుల రిమాండ్ విధించారు. కస్టడీ ఆదేశాల తర్వాత బయటకు వచ్చిన కస్తూరి అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. అధికార దుర్వినియోగానికి ముగింపు పలకాలని.. న్యాయాన్ని గెలిపించాలని కామెంట్ చేశారు. ఈనెల 3వ తేదీన చెన్నైలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో కస్తూరి తెలుగువారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవి తీవ్ర దుమారం రేపాయి. తమిళనాడులోని అనేక పోలీస్ స్టేషన్‌లలో ఆమెపై కేసులు పెట్టారు. తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆమె మదురై కోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం, చెన్నైలో అందుబాటులో లేకపోవడంతో పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లోని ఒక ప్రొడ్యూసర్ ఇంట్లో షెల్టర్ తీసుకున్నట్టు గుర్తించి ఆమెను అరెస్ట్ చేశారు.