ప్రాణం తీసిన ప్రేమ వివాదం.. - స్నేహితుడే హంతకుడు
ఈ నెల 17వ తేదీన పార్టీ చేసుకుందాం రమ్మంటూ నవీన్‌ని హైదరాబాద్ నగర శివారుకు తీసుకెళ్లాడు హరి. ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. అక్కడ ప్రేమ విషయంలో అతనితో గొడవ పడ్డాడు.
ఇదో `ప్రేమ దేశం` సినిమాలోని కథలాంటిది.. కానీ, సినిమా కథలో త్యాగం మిళితమై ఉండగా.. రియాలిటీలో మాత్రం క్రైమ్ జరిగింది. ప్రేమ దేశం సినిమాలో హీరో క్యారెక్టర్స్ లాగానే రియాలిటీలో కూడా ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. వారిద్దరూ జూనియర్ ఇంటర్ నుంచీ ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నారు. వారిద్దరిలో ఒకరికి ఈ విషయం నచ్చలేదు. తన ప్రేమకు అడ్డువస్తున్నాడని భావించి.. తన స్నేహితుడినే హతమార్చాలని ప్లాన్ చేశాడు. నమ్మకంగా తీసుకెళ్లి హతమార్చాడు. తన ప్రేమకు అడ్డు తొలగించుకున్నానని అనుకున్నాడు. కానీ, దీనివల్ల తన జీవితాన్ని జైలుపాలు చేసుకుంటున్నానని మరిచాడు.
ఇంతకీ అసలేం జరిగిందంటే.. నార్కెట్పల్లికి చెందిన నవీన్, హరి బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరూ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నారు. తమతో పాటు జూనియర్ ఇంటర్ నుంచి చదువుతున్న ఓ యువతిని ఇద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు ప్రేమించారు. ఇటీవల ఆ విషయం బయటపడటంతో ఇద్దరూ పలుమార్లు గొడవపడ్డారు. మరోపక్క సదరు యువతి నవీన్‌కి దగ్గరవుతోందని భావించిన హరి.. అతన్ని అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఈ నెల 17వ తేదీన పార్టీ చేసుకుందాం రమ్మంటూ నవీన్‌ని హైదరాబాద్ నగర శివారుకు తీసుకెళ్లాడు హరి. ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. అక్కడ ప్రేమ విషయంలో అతనితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో నవీన్‌ను హతమార్చిన హరి.. అక్కడినుంచి పరారయ్యాడు. తన కుమారుడు కనిపించడం లేదంటూ నవీన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు చేపట్టిన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు నవీన్ మృతదేహాన్ని గుర్తించారు. పోలీస్ దర్యాప్తులో స్నేహితుడు హరి హత్య చేశాడని తేలింది. ప్రేమ కోసం జరిగిన గొడవ వల్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు తేల్చారు. ప్రస్తుతం హరి పోలీసులకు లొంగిపోయినట్టు సమాచారం.