సినీ నటుడు మోహన్‌బాబుపై కేసు నమోదు

నేడు ఉదయం 10.30 గంటలకు తమ ముందు హాజరుకావాలని రాచకొండ సీపీ ఆదేశం

Advertisement
Update:2024-12-11 10:27 IST

సినీ నటుడు మోహన్‌బాబుపై కేసు నమోదైంది. జర్నలిస్టులపై దాడి కేసులో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పహాడీ షరీఫ్‌ పోలీసులు ఆయనపై బీఎన్‌ఎస్‌ 118 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. కుటుంబ వివాదం నేపథ్యంలో మంగళవారం జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసానికి మీడియా ప్రతినిధులు వెళ్లారు. ఈ క్రమంలో మోహన్‌బాబుతో పాటు వచ్చిన బౌన్సర్లు, సహాయకులు.. మీడియా ప్రతినిధులను బైటికి గెంటివేయడంతో పాటు కట్టెలతో దాడికి పాల్పడ్డారు. ఓ ఛానల్‌ ప్రతినిధి చేతిలో ఉన్న మైకును గుంజుకుని ముఖంపై కొట్టారు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. బౌన్సర్లు నెట్టివేయడంతో ఓ ఛానల్‌ కెమెరామన్‌ కింద పడ్డారు. దాడిని నిరసిస్తూ మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు. మోహన్‌బాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే కేసు నమోదైంది. రాచకొండ సీపీ ఈ కేసు విచారణ చేయనున్నారు.

నటుడు మోహన్‌ బాబుకు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయనతో పాటు మంచు విష్ణు, మనోజ్​ లకు నోటీసులు ఇచ్చారు. మోహన్​ బాబుపై ఆయన కుమారుడు మంచు మనోజ్ ఫిర్యాదుతో పాటు జల్‌పల్లిలో మనోజ్‌ తో పాటు మీడియా ప్రతినిధులపై దాడి ఘటనను రాచకొండ పోలీసులు సీరియస్‌ గా తీసుకున్నారు. మీడియాపై మోహన్‌ బాబు దాడి అనంతరం జల్‌పల్లిలోని మోహన్‌ బాబు నివాసం నుంచి ప్రైవేట్‌ సెక్యూరిటీతో పాటు బౌన్సర్లను బయటికి పంపారు. మోహన్‌ బాబు ఇంటికి పోలీసులు భద్రత పెంచారు. దాడి ఘటనపై బుధవారం ఉదయం 10.30 గంటలకు తమ ముందు హాజరుకావాలని రాచకొండ సీపీ ఆదేశించారు. మోహన్‌ బాబుతో పాటు విష్ణుకు గతంలో జూబ్లీహిల్స్‌ పోలీసులు ఇచ్చిన గన్‌ లైసెన్సులతో పాటు గన్స్‌ సరెండర్‌ చేయాలని నోటీసులో పేర్కొన్నారు. మీడియాపై దాడి అనంతరం మోహన్‌ బాబుకు బీపీ పెరిగి కింద పడిపోయాడు. ఆయన పెద్ద కుమారుడు వెంటనే గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ హాస్పిటల్‌ కు తరలించారు. ఇప్పటికే మనోజ్‌ తల్లి అదే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మోహన్‌ బాబు కాలికి గాయం అయ్యిందని.. బీపీతో పాటు కాలికి తగిలిన గాయానికి డాక్టర్లు ట్రీట్‌మెంట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మోహన్‌ బాబు విచారణకు హాజరవుతారా? లేదా అన్నది ఇప్పటివరకు స్పష్టత లేదు. అయితే మనోజ్‌ మాత్రం విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

Tags:    
Advertisement

Similar News