పెళ్లింట పెను విషాదం.. - సిలిండర్ పేలి ఏడుగురు మృతి.. 52 మందికి గాయాలు
మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరో 52 మంది గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పెళ్లి సందడితో కళకళలాడుతున్న ఆ ఇల్లు ఒక్కసారిగా శవాల గుట్టలా మారింది. ఊహించని విధంగా జరిగిన ఘటన ఆ ఇంట పెను విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందగా, 52 మంది గాయాలపాలయ్యారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. బరాత్‌కు ముందు పెళ్లి కుమారుడి ఇంటి వద్ద అందరూ సందడిగా కబుర్లు చెప్పుకుంటూ టీ తాగుతుండగా, ఒక్కసారిగా విస్పోటనం సంభవించింది. స్టోర్ రూమ్‌లోని గ్యాస్ సిలిండర్ లీకవడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరో 52 మంది గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడినవారిలో వరుడు, అతని తల్లిదండ్రులు ఉన్నారు. వీరు ముగ్గురూ తీవ్రంగా గాయపడినట్టు తెలిసింది.
క్షతగాత్రులకు సీఎం పరామర్శ
ఈ దుర్ఘటన సమాచారం అందుకున్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు సత్వరం మెరుగైన వైద్యం అందించేందుకు ఆస్పత్రి సిబ్బందిని ఆదేశించారు.
తెగువ చూపిన పోలీసు అధికారి..
ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసు అధికారి డుంగర్ సింగ్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నాడు. మంటల్లో చిక్కుకున్న ఇంటిలో మరికొన్ని గ్యాస్ సిలిండర్లు ఉన్నట్టు బాధితుల ద్వారా తెలుసుకున్న ఆ అధికారి.. అవి కూడా పేలితే మరింత ప్రమాదం జరుగుతుందని భావించి.. ప్రాణాలకు తెగించి సాహసానికి దిగాడు. దగ్ధం అవుతున్న ఇంట్లోకి దూకి.. మంటలు అంటుకున్న సిలిండర్లను బయటికి తీసుకొచ్చాడు. సింగ్ చూపిన తెగువ గురించి తెలుసుకున్న సీఎం గెహ్లాట్ అతన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఆ అధికారికి పదోన్నతి ఇస్తున్నట్టు ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు.