రెండో రోజూ నష్టాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు
రూ.7 లక్షల కోట్లు కోల్పోయిన ఇన్వెష్టర్లు
వరుసగా రెండో రోజు భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. గురువారం ఒక్కరోజే ఇన్వెష్టర్ల సంపద రూ.7 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. బీఎస్‌ఈలో మధుపరుల సంపద రూ.435 లక్షల కోట్లకు తగ్గిపోయింది. ఈ వారంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు సుమారు రూ.20 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. గురువారం ఉదయం 78,206.21 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో పార్రంభమైన సెన్సెక్స్ కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఒకదశలో 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ చివరికి 528.28 పాయింట్లు కోల్పోయి 77,620.21 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 162.45 పాయింట్లు కోల్పోయి 23,526.50 పాయింట్ల వద్ద ముగిసింది. మహీంద్ర అండ్ మహీంద్ర, హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా, కోటక్ మహీంద్ర, ఏషియన్ పేయింట్స్ షేర్లు లాభపడగా, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, జొమాటో షేర్లు నష్టపోయాయి.